Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా క్షీణిస్తున్న ప్రజల కొనుగోలు శక్తి
- వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం
- తగ్గుతున్న ఉత్పత్తి రంగం
- పెరుగుతున్న నిరుద్యోగం
'భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా పురోగమిస్తోంది. భారతీయ వినియోగదారులు, ఉత్పత్తిదారులు భవిష్యత్తు పట్ల ఆశాజనకంగానూ, విశ్వాసంగానూ ఉన్నారు. దీనినుండి ప్రపంచ దేశాలు స్ఫూర్తిని పొందాలి. ఈ సమావేశంలో పాల్గొంటున్న వారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల దృక్పధాన్ని అందించగలరని మేం ఆశిస్తున్నాం. ప్రపంచ వృద్ధిలో స్థిరత్వాన్ని, నమ్మకాన్ని సాధించాలంటే అదొక్కటే మార్గం.'
-ఫిబ్రవరి 24వ తేది జరిగిన జి-20 దేశాల ఆర్థిక మంత్రుల, సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సందేశం ఇది!
న్యూఢిల్లీ : ప్రధాని ఆ మాటలు చెప్పి పది రోజులు గడవకముందే వాల్‌స్ట్రీట్ జర్నల్ తాజాగా దానికి పూర్తి భిన్నమైన కథనాన్ని ప్రచురించింది. భారత ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా తగిందని, దీని ప్రభావం ఉత్పత్తులపై పడుతోందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఈ నిర్థారణలు చేయడం గమనార్హం. వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం... సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో దేశ వార్షిక ఆర్థిక (ఇయర్ ఓవర్ ఇయర్) వృద్ధి 6.3 శాతం కాగా, తాజాగా విడుదల చేసిన డిసెంబర్ గణాంకాల ప్రకారం 4.4 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. తయారీ రంగంలో క్షీణత కొనసాగుతున్న ఫలితంగానే వృధ్ధి రేటు గణనీయంగా తగ్గింది. ప్రజల కొనుగోలు రేటు గణనీయంగా తగ్గడం కూడా వృద్ధి గణాంకాలపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఏడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో 8.8 శాతం ఎక్కువగా ప్రజలు దేశ వ్యాప్తంగా ఖర్చు చేశారు. అయితే, తాజాగా విడుదలైన డిసెంబర్ గణాంకాలను పరిగణలోకి తీసుకుంటే ఈ పెరుగుదల కేవలం 2.1 శాతమే! అంటే, సెప్టెంబర్‌తో పోలిస్తే ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. గత ఏడాది (2021) డిసెంబర్లో 10.8 శాతంగా ప్రయివేటు వినియోగం నమోదు కాగా, 2022 డిసెంబర్ మాసాంతానికి 2.1 శాతం మాత్రమే నమోదైంది. జిడిపిలో 60 శాతం దాకా ఈ రంగం నుండే రావాల్సి ఉందని, అది పుంజుకోకపోగా తగ్గుతుండడం ఆందోళనకరమని పేర్కొంది. కొనుగోళ్లు లేకపోవడం ఉత్పత్తి కార్యక్రమాలపై ప్రభావం చూపుతోందని, నిరుద్యోగానికి, ఉపాధి రహితస్థితికి కారణమవుతోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ విశ్లేషించింది.
ఎందుకీ స్థితి?
'అధిక ధరలతోపాటు వడ్డీ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కరోనా సంక్షోభం తరువాత గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి ఆశించినంతగా మెరుగుపడలేదు. పట్టణాలు, నగరాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. దీనికి తోడు కరోనా కాలంలో ఇచ్చిన అనేక సబ్సిడీలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇది ప్రజలకు భారంగా మారింది' అని 'వాల్‌స్ట్రీట్' విశ్లేషించింది. 2021 మే నెల నుండి ఇప్పటి వరకు రిజర్వు బ్యాంకు పలు దఫాలు వడ్డీ రేటు పెంచిన విషయం తెలిసిందే. ఏప్రిల్ నెలలో మరో 0.25 పాయింట్లను పెంచే అవకాశం ఉందని, ఈ మేరకు ఇప్పటికే కసరత్తు జరుగుతోందని పేర్కొంది. దీనితో కలుపుకుంటే వడ్డీ రేట్లు 6.75 శాతానికి చేరుకుంటాయని, ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారుతోందని తెలిపింది. దిగుమతులు తగ్గడం కూడా ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోందనడానికి నిదర్శనమని వివరించింది.
మరింత క్లిష్టం...
ప్రభుత్వం చెబుతున్న మాటలు ఎలా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని వాల్‌స్ట్రీట్ జర్నల్ హెచ్చరించింది. వాతావరణ మార్పుల కారణంగా వేసవి కాలం తీవ్రంగా ఉండనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతోపాటు ఎల్‌నినో పరిస్థితుల ప్రభావాన్ని ప్రస్తావించింది. వడగాల్పులు ఉధృతంగా ఉండడంతో ఆర్థిక కార్యకలాపాలు మరింతగా క్షీణించనున్నాయని అంచనా వేసింది.
హెచ్చరించిన వామపక్షాలు
దేశ వ్యాప్తంగా ప్రజల కొనుగోలుశక్తి పడిపోతుండడం, నిరుద్యోగం పెరుగుతుండడంపై వామపక్షాలతోపాటు, పలువురు ఆర్థిక నిపుణులు కేంద్ర ప్రభుత్వాన్ని కొంతకాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి చర్యలు తీసుకోవాలని వారు చేసిన సూచనలను కేంద్రం ఏ దశలోనూ పట్టించుకోలేదు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్లు పెంచడమే మార్గం కాదని, ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టాలని చేసిన సూచనలను కూడా కేంద్రం పెడచెవిన పెట్టింది.