Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూర్తిస్థాయి నియంత పాలనలోకి వెళ్తున్న టాప్-10 దేశాల్లో భారత్
- 'లిబరల్ డెమొక్రసీ'లో భారత్‌కు 97వ స్థానం
- ఎలక్టోరల్ డెమొక్రసీలో 108వ స్థానం : వి-డెమ్ నివేదిక
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య భావనలు దెబ్బతింటున్నాయి. పూర్తిస్థాయి నియంత తరహా పాలనలోకి వెళ్తున్న దేశాల సంఖ్య 42కు చేరుకుంది. ఇందులోని మొదటి పది దేశాల్లో భారత్ ఉంది. సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో లేకపోవటం, ఏకపార్టీ పాలన, మైనార్టీ హక్కులకు భంగం, రాజకీయ హింస మొదలైనవి..హంగేరీ, బ్రెజిల్, భారత్, పోలాండ్, టర్కీ..వంటి దేశాల్ని 'నియంతృత్వం' దిశగా తీసుకెళ్తున్నాయి. 2022 చివరి నాటికి ఆ దేశాల్లో నియంతృత్వ పోకడలు పతాక స్థాయికి చేరుకున్నాయి. బలమైన రాజ్యాంగ సంస్థలు, న్యాయ వ్యవస్థ, శాంతిభద్రతలు, మెరుగైన ఆరోగ్య సేవలు ప్రజలకు దక్కాలంటే 'ప్రజాస్వామ్యం' బలంగా ఉండాల్సిందే.
- వి-డెమ్ నివేదిక
న్యూఢిల్లీ : భారత్‌లో ప్రజాస్వామ్యం దెబ్బతింటోంది..నియంత తరహా పాలన బలపడుతోందని 'వి-డెమ్' నివేదిక ప్రమాద ఘంటికలు మోగించింది. ప్రజాస్వామ్య సూచికల్లో గత 10ఏండ్లుగా భారత్ స్థాయి వేగంగా పడిపోతోందని హెచ్చరించింది. 'మతస్వేచ్ఛ' పట్టికలో అట్టడుగునకు చేరుకుంది. పౌర హక్కులు, వాక్ స్వాతంత్య్రం, ఎన్నికల ప్రజాస్వామ్యం, బలమైన రాజ్యాంగ సంస్థలు..ఇలా అనేక విషయాల్లో భారత్ గణనీయంగా వెనుకపడింది. ఈ ఏడాది లిబరల్ డెమొక్రసీలో భారత్‌కు 97వ స్థానం, ఎలక్టోరల్ డెమొక్రసీలో 108వ స్థానం, సమానత్వంలో 123వ స్థానం...ఊహించిందేనని 'వి-డెమ్' పేర్కొంది. స్వీడన్‌కు చెందిన 'యూనివర్సిటీ ఆఫ్ గోతెన్‌బర్గ్' పరిశోధకులు ప్రతిఏటా ఈ నివేదికను రూపొందిస్తారు. ఆయా దేశాల్లో ప్రజాస్వామ్య భావనలు ఏమేరకు ఉన్నాయన్నది విశ్లేషిస్తూ ర్యాంకులు విడుదల చేస్తారు.
ప్రపంచవ్యాప్తంగా..
2022 నాటికి మొత్తం ప్రపంచ జనాభాలో 72శాతం మంది (సుమారుగా 570 కోట్లమంది) నియంతృత్వ దేశాల్లో నివసిస్తున్నారు. ఆయా దేశాల్లో గత 35ఏండ్లలో ప్రజాస్వామ్యంలో వచ్చిన మార్పు...తుడుచుకుపెట్టుకు పోయింది. ఇందుకు ప్రధాన కారణం ఆయా దేశాల్లోని పాలకులు, వారి రాజకీయ విధానాలు. కేవలం 13శాతం ప్రజలే స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశాల్లో జీవిస్తున్నారు. 35 దేశాల్లో వాక్ స్వాతంత్య్రం క్షీణిస్తోంది. 45 దేశాల్లో మీడియాపై సెన్సార్షిప్ పెరిగింది. 37 దేశాల్లో పౌర హక్కులకు తీవ్రస్థాయిలో విఘాతం కలిగింది. అర్మేనియా, గ్రీస్, మారిషస్..తదితర దేశాల్లో ప్రజాస్వామ్యం వేగంగా బలహీనపడుతోంది.
కోవిడ్-19 పేరుతో
అనేక దేశాల్లో ప్రభుత్వాలు కోవిడ్-19 సంక్షోభాన్ని సాకుగా చూపి మొత్తం అన్ని వ్యవస్థల్ని తమ చేతుల్లో బంధించాయి. పౌరుల స్వేచ్ఛ, హక్కుల్ని బలహీనపర్చేలా అనేక చట్టాలు చేశాయి. హంగేరీ అధ్యక్షుడు విక్టోర్ ఓర్బాన్ తన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి దేశంలో పలు మార్లు అత్యవసర పరిస్థితులు ప్రకటించాడు. కోవిడ్ సమయంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి, 2022లో ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపి అత్యవసర పరిస్థితి విధించాడు. అమెరికాలోని కెంటకీలో బొగ్గు తవ్వకాలకు వ్యతిరేకంగా సాగిన నిరసనలపై అణచివేత, అబార్షన్లను నిషేధిస్తూ టెక్సాస్‌లో నిర్ణయం...అమెరికా స్థాయిని దిగజార్చింది.
భారత్‌లో...
జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేశాక, మోడీ సర్కార్ అక్కడ కొత్త చట్టాల్ని తీసుకొచ్చింది. ఏప్రిల్ 2020లో 'నివాస చట్టాన్ని' అమల్లోకి తీసుకొచ్చింది. కాశ్మీరీల హక్కులను దెబ్బతీస్తూ కేంద్రం ఏకపక్ష ధోరణితో కీలక నిర్ణయాలు చేస్తోంది. దీంతో కాశ్మీర్లో పరిస్థితి నానాటికి దిగజారుతోంది. అనేక దేశాల్లో నెలకొన్న 'నియంత పోకడలు' భారత్‌లోనూ ఉన్నాయి. 2020లో ఏకపక్షంగా విధించిన లాక్‌డౌన్‌తో ఎంతోమంది వలసకూలీలు, పేదలు రోడ్డునపడ్డారు. 'ఎన్నికలతో కూడిన నియంతృత్వ' దేశంగా భారత్‌ను 2021లో వి-డెమ్ పేర్కొంది. పౌర సంఘాల అణిచివేత, వాక్ స్వాతంత్రంపై దాడులు, మీడియా, పౌర హక్కుల కార్యకర్తలపై నిఘా పతాక స్థాయికి చేరింది. విద్య, సాంస్కృతిక రంగాల్లో అణచివేత, వివక్ష తీవ్రస్థాయికి చేరాయి. తప్పుడు సమాచారం, మతపరమైన ఏకీకరణ..నియంతృత్వాన్ని బలోపేతం చేస్తున్నాయి. అందువల్లే ఆఫ్ఘనిస్తాన్, భారత్, బ్రెజిల్, మయన్మార్లు 'నియంతృత్వ' దేశాలుగా వేగంగా మార్పు చెందుతున్నాయి.