Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేద్దామన్నా మహిళలకు ఉద్యోగాలు లేవు
- వేతనాల్లోనూ భారీ వ్యత్యాసం
- ఐఎల్ఓ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : ఎక్కడమ్మా నీవు లేనిది.... ఏమిటీ నీవు చేయలేనిది? అని పాడుకుంటాం కదూ! నిజమే.. అన్ని రంగాల్లోనూ మహిళలు దూసుకుపోతున్నారు. ఇంట్లో బండెడు చాకీరి చేయడంతో పాటు, బయట పనులు చేస్తే ఆర్థికంగా కుటుంబ భారాన్ని మోస్తున్నారు. నూతన ఆర్థిక విధానాల పుణ్యమా అని భార్య,భర్తలు ఇద్దరు రెక్కలు ముక్కలు చేసుకుంటేగానీ, ఇల్లు గడవని రోజులు వచ్చేశాయి. కానీ, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలోనూ వివక్ష ఎదురవుతోంది. పనిచేయడానికి మహిళలు ముందుకు వస్తున్నప్పటికీ వారికీ ఉద్యోగాలు దొరకడం లేదు. అరకొర ఉపాధి కూడా అంతంతమాత్రంగానే ఉంది. పురుషుడు, మహిళ ఒక పనికి పోటీ పడితే మగవారిపట్లే మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు. వేతనాల్లోనూ భారీ వ్యత్యాసం నెలకొంది. ఈ పరిస్థితి మనదేశంలోనే కాదు. ఒకటి, రెండు దేశాలు మినహా భూగోళమంతా ఇదే తరహా వివక్ష నెలకొంది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) ఈ మేరకు రూపొందించిన నివేదిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా 15శాతం మంది...
ఐఎల్ఓ విడుదల చేసిన వివరాల ప్రకారం అన్ని అర్హతలు ఉండి, చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 15శాతం మంది మహిళలకు ఉద్యోగాలు దొరకడం లేదు. వివిధ విద్యార్హతలు, వయసుల వారిని గ్రూపులుగా చేసి ఐఎల్ఓ ఈ నిర్ధారణకు వచ్చింది. అదే సమయంలో ఈ తరహా నిరుద్యోగం (అర్హతలు ఉండి, పనిచేయడానికి ఆసక్తి కలిగిఉండటం) పురుషులలో 10.5శాతం మాత్రమే. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ తరహా నిరుద్యోగం మహిళల్లో 24.9శాతం ఉండగా, పురుషుల్లో 16.6శాతం ఉంది. అనేక సందర్భాల్లో విద్యార్హతలతో సబంధం లేకపోయినప్పటికీ పురుషులకు ఏదో ఒక ఉపాధి అవకాశం లభిస్తోంది. మహిళలకు మాత్రం అటువంటి అరకొర సంపాదన అవకాశం కూడా లభించలేడం లేదు.
అవే కారణాలు...!
అర్హతలు ఉన్నప్పటికీ పురుషులతో సమానంగా మహిళలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన సాకులు చెబుతున్నట్లు ఐఎఎల్ఓ పేర్కొంది. 'వారికి ఇంటి పని ఉంటుంది. సకాలంలో కార్యాలయాలకు రారు' అన్న మాట మన దేశంతో పాటు అనేక దేశాల్లో వినిపించింది. అయితే, వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ మంది సకాలంలో ఆఫీసులకు వస్తున్నారని తేలింది. ఆలస్యంగా వచ్చిన వారు కూడా పురుషులతో పోలిస్తే ఎక్కువ సమయం కార్యాలయాల్లోనే ఉండి పనులు చేస్తున్నారు. ప్రసూతి సెలవులు, పిరియడ్స్, పిల్లల పెంపకం వంటివాటిని కూడా మహిళలకు ఉద్యోగాలు, ఉపాధి నిరాకరించడానికి కారణాలుగా చెబుతున్నారు.
వేతనాలు తక్కువే!
ఉద్యోగాలు దొరకడమే కష్టంగా ఉంటే, దొరికిన ఉద్యోగాల్లోనూ పూర్తిస్థాయిలో మగవారితో సమానంగా వేతనాలు లభించడంలేదు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఈ తరహా వ్యత్యాసం ఉండంటం గమనార్హం. సగటున పురుషుల ఒక డాలర్ సంపాదనకు మహిళలకు 51 సెంట్లు మాత్రమే లభిస్తోందని ఐఎల్ఓ పేర్కొంది. పేద దేశాల్లో ఈ తేడా మరింత భారీగా ఉంది. ఈ దేశాల్లో పురుషుల ప్రతి డాలర్ సంపాదనకు మహిళలకు 29 సెంట్లు మాత్రమే దక్కుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో పురుషుల ప్రతి డాలర్ సంపాదనకు మహిళలకు 58 సెంట్లు లభిస్తోంది. అంటే, అభివృధ్ది చెందామని చెప్పుకుంటున్న దేశాలు సైతం మహిళలకు సమాన హక్కులను దఖలు పరచడంలో విఫలమయ్యాయి. గతంలో పోలిస్తే అనేక దేశాల్లో లింగ అసమానత పెరుగుతోందని, దానిని తగ్గించి సమానత్వాన్ని సాధించాలన్న లక్ష్యం నీరుగారు తోందని ఐఎల్ఓ వ్యాఖ్యానించడం గమనార్హం.