Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో వలస కార్మికులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మంగళవారం కలుసుకున్నారు. కార్మికులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పని పరిస్థితులు గురించి ఆరా తీశారు. 'మిమ్మల్ని రక్షించడానికే మేం ఇక్కడ ఉన్నాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు' అని కార్మికులకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తమిళనాడులో వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయని ఇటీవల బిజెపి విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో జిల్లాలోని కావల్కినరు వద్ద సర్జికల్ గ్లవ్స్ తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతో స్టాలిన్ సంభాషించారు. కూలీలకు ఆహారం, వసతి, పని పరిస్థితులు, పని గంటలు, యాజమాన్యాం కల్పిస్తున్న ఇతర సౌకర్యాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. తాము సురక్షితంగా ఉన్నామని కార్మికులు తెలిపారు. ఈ పరిశ్రమలో దాదాపు 450 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరిలో సుమారు 200 మంది బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ నుంచి వలస కార్మికులని యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. వీరిలో అనేక మంది కార్మికులు కుటుంబాలతో సహా కొన్ని ఏళ్ల నుంచి పనిచేస్తున్నారని చెప్పింది. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ కార్మికులను భయాందోళనలను గురి చేయడానికి కొంత మంది ఉద్దేశ్యపూర్వకంగానే ఇలాంటి పుకార్లును వ్యాప్తి చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి పుకార్లు బిజెపికి వ్యతిరేకంగా ఉన్న కూటమిలో చీలకలు సృష్టించలేవని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రులు కె. నెహ్రూ, కె. రామచంద్రన్; టి.తుంగరాజ్, కలెక్టర్ పిఎన్ శ్రీథర్ తదితరులు ఉన్నారు.