Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజమైన వృద్ధిని తెలపదు : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ : దేశంలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యిందన్న పాలకుల మాటల్లో వాస్తవం లేదని ఆర్థిక నిపుణులు తేల్చి చెబుతు న్నారు. అంతేగాక ఆర్థిక వృద్ధికి సంబంధించి 'తలసరి ఆదాయా'నికి పెద్దగా ప్రాధాన్యత ఉండదని, దీనిని అంతగా లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణుడు ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ అన్నారు. ప్రస్తుత ధరలను పరిగణలోకి తీసుకొని లెక్కగడితే, 2014-15 తర్వాత ఈ 8ఏండ్లలో తలసరి ఆదాయం రెట్టింపు అయ్యింది. రూ.86,647 నుంచి రూ.1,72,000కు పెరిగింది. తలసరి ఆదాయంలో పెరుగుదల 98.5శాతముంది. మోడీ సర్కార్ ఏర్పడకముందు, 2006-07లో తలసరి ఆదాయం రూ.33,717గా ఉంది. ఇది 2014-15 నాటికి రూ.86,647కు చేరుకుంది. తలసరి ఆదాయంలో పెరుగుదల 157శాతంగా ఉంది. దీనినిబట్టి మోడీ సర్కార్‌కు ముందు 8ఏండ్లలో తలసరి ఆదాయంలో పెరుగుదల భారీగా ఉందని జాతీయ ఆంగ్ల దినపత్రిక ఒకటి వార్తా కథనం వెలువరించింది. దేశంలోని మొత్తం జనాభా ఆదాయాన్ని, జనాభా సంఖ్యతో భాగిస్తూ 'తలసరి ఆదాయా'న్ని లెక్కగడతారు. ప్రతి రాష్ట్రానికి, జిల్లాకూ ఇదే వర్తిస్తుంది. అంబానీ, అదానీ, టాటా, బిర్లా..సహా పెద్ద పెద్ద ధనవంతులు నివసించే ముంబయిలో తలసరి ఆదాయం వందల కోట్లలో వస్తోంది. అలాగే ముంబయిలోని ధారావి వంటి చోట్ల నివసించే సాధారణ ప్రజల తలసరి ఆదాయమూ కోట్లలో కనపడుతోంది. వాస్తవానికి వారి ఆదాయం అలా ఉండదు. కాబట్టి ఇది సరైన వృద్ధి గణాంకం కాదని ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ వంటి ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక ఏడాదిలో..ఒక ప్రాంతంలో నివసించే జనాభా మొత్తం ఆదాయం పెరిగితే, అక్కడున్నవారి ఆదాయాలు పెరిగినట్టు కాదు. అలాగే ఆదాయ అసమానతల్ని 'తలసరి ఆదాయం' ద్వారా తెలుసుకోలేమని నిపుణులు గుర్తు చేస్తున్నారు. తలసరి ఆదాయం భారీగా పెరిగిందని తెలుపుతూ 'ఎన్ఎస్ఎస్వో' ఫిబ్రవరిలో గణాంకాల్ని విడుదల చేసింది. 2011-12 నాటి స్థిర ధరలను లెక్కలోకి తీసుకొని తలసరి ఆదాయం లెక్కగట్టింది. 2014-15లో దేశంలో తలసరి ఆదాయం రూ.72,805గా ఉందని తెలిపింది. ఇది 2022-23నాటికి రూ.98,118కి పెరిగిందని, జీడీపీ భారీగా పెరిగిందని గణాంకాల్ని విడుదల చేశారు. వీటిపై స్పందించిన ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్ మాట్లాడుతూ, ''ప్రస్తుత ధరలతో జీడీపీని గణించారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం కూడా పరిగణలోకి తీసుకుంటే..జీడీపీ తగ్గుతోంది.అనేక రంగాల్లో పెద్ద ఎత్తున వేతనాలు పడిపోయాయి. తలసరి ఆదాయం పెరగటం అన్నది వాస్తవాన్ని ప్రతిబింబించటం లేదు'' అని చెప్పారు.