Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడు రోజులు జ్యుడిషియల్ కస్టడీ
- రిమాండ్ రిపోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులను అదుపులోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా మరో కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఇటీవల రెండు రోజుల పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ''బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధినంటూ అరుణ్ రామచంద్ర పిళ్ళై అంగీకరించారు. ఆయనను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వండి. కేసు దర్యాప్తుకు సహకరించడం లేదు. మనీ ట్రయల్స్ గుట్టు తేల్చడానికి కస్టడీ అవసరం. రూ.25 కోట్లు నేరుగా ట్రాన్స్ఫర్ చేశారు'' అంటూ ఈడీ వాదనలు వినిపించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన అరుణ్ 17 పేజీల రిమాండ్ రిపోర్డులో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. ఎమ్మెల్సీ కవితకు లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో అరుణ్ పిళ్లై అన్నీ తానై వ్యవహరించాడని పేర్కొంది. ''సౌత్ గ్రూప్ ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ చంద్రారెడ్డితోపాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవ ఉన్నారు. సౌత్‌గ్రూప్ ప్రతినిధులుగా అరుణ్ పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు ఉన్నారు. కవితకు లబ్ది కోసం అరుణ్ పిళ్లై అన్నీ తానై వ్యవహరించారు. ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చినట్లు అరుణ్ దర్యాప్తులో అంగీకరించారు. రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.292 కోట్లు సంపాదించారు. అరుణ్ పిళ్లై కవిత బినామీ అని విచారణలో పలు మార్లు చెప్పారు. ఇదే విషయాన్ని మరి కొందరు కూడా చెప్పారు. మద్యం విధానం రూపకల్పనలో పిళ్లై కీలక పాత్ర పోషించారు'' అని ఈడీ తన రిపోర్టులో పేర్కొంది. సౌత్‌గ్రూప్ వ్యక్తుల సంస్థలన్నీ కలిసి రూ.3,500 కోట్ల వ్యాపారం చేశాయని ఈడీ తెలిపింది. రామచంద్ర పిళ్లైకి రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామచంద్ర పిళ్లై అరెస్ట్‌తో మద్యం విధానం మనీలాండరింగ్ కేసులో అరెస్టుల సంఖ్య పదికి చేరింది.