Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో 38 శాతం తగ్గిన కేటాయింపులు
- 2023-24లో రూ. 3097 కోట్లకు పడిపోయిన వైనం
- కేంద్రంపై మైనారిటీల అసంతృప్తి
న్యూఢిల్లీ : భారత్లో మోడీ సర్కారు దేశంలోని మైనారిటీలకు కావాల్సిన భరోసానివ్వడం లేదు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారిని ప్రతి విషయంలోనూ చిన్న చూపు చూస్తున్నది. ఇటీవలి బడ్జెట్లోనూ మైనారిటీలకు మొండి చేయే చూపెట్టింది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తక్కువ కేటాయింపులు జరిపింది. వారికి సంబంధించిన పథకాల్లో కోతలు పెట్టింది. దీంతో మోడీ సర్కారుపై దేశంలోని మైనారిటీలు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
2022-23బడ్జెట్లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మోడీ సర్కారు రూ. 5020.50 కోట్లను కేటాయించింది. అది 2023-24 బడ్జెట్లో ఈ ఏడాది 3097 కోట్లుగా ఉన్నది. ఈ తగ్గుదల దాదాపు 38 శాతం కావడం గమనార్హం. 2022-23 సవరణ అంచనా బడ్జెట్ రూ. 2612.66 కోట్లుగా ఉన్నది. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో జరిపిన వాస్తవ కేటాయింపుల కంటే తగ్గుదల 47.9 శాతం కావడం గమనార్హం.
మైనారిటీలకు విద్య, నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గడం ఆందోళనకరం. మైనారిటీలకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లో దాదాపు రూ. 900 కోట్ల కోత (69.6 శాతం తగ్గుదల) నమోదు కాగా, మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్షిప్ దాదాపు 88 శాతం తగ్గింది. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రాష్ట్ర పీఎస్సీల ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మైనారిటీ విద్యార్థులకు బడ్జెట్లో ఒరిగింది ఏమీ లేదు. గతేడాది ఈ కేటాయింపులు రూ. 8 కోట్లుగా ఉన్నాయి.
మైనారిటీలకు ఉచిత కోచింగ్, అనుబంధ పథకాలు మరియు మైనారిటీల విద్యా సాధికారత కోసం కేటాయింపులు వరుసగా 62 శాతం, 32.8 శాతం తగ్గాయి. నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి 2022-23లో రూ. 491 కోట్ల నుంచి 2023-24లో రూ.64.4 కోట్లకు భారీగా (86.8శాతం తగ్గుదల) పడిపోయింది. మైనారిటీ వర్గాలకు చెందిన రీసెర్చ్ స్కాలర్లకు ఆర్థిక సాయం అందించే మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ (ఎంఏఎన్ఎఫ్) 2022లో నిలిపివేయబడింది.