Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎస్ఎంఈ సంఘాల సదస్సు డిమాండ్
చెన్నై:దేశంలోని బడా కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని ఆపాలని, జీఎస్టీని సవరించాలని ఎంఎస్ఎంఈ సంఘాల సదస్సు డిమాండ్ చేసింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఇటీవల జరిగిన ఎంఎస్ఎంఈ సంఘాల సదస్సులో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న నష్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్చేలా చర్యలు చేపట్టాలని సదస్సు డిమాండ్ చేసింది. చిన్న తరహా పరిశ్రమలపై వేస్తున్న జీఎస్టీ భారాన్ని తగ్గించి ఎంఎస్ఎంఈని రక్షించాలని ఈ సదస్సు కోరింది. బడా కార్పొరేట్లకు, చిన్న పరిశ్రమలకు ఒకేవిధమైన పన్ను విధించడాన్ని ఖండించింది. పరిశ్రమలకు సంబంధించి యుకె సిన్హా కమిటీ ఇచ్చిన సిఫారసులను కేంద్రం తక్షణమే అమలు చేయాలి. దేశీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రత్యేక నిధి ప్యాకేజీని కేటాయించాలని 2006లో ఎంఎస్ఎంఈ చట్ట సవరణలు కోరినట్టుగా కేంద్రం అమలు చేయాలని సదస్సు డిమాండ్ చేసింది. చిన్న పరిశ్రమలకిచ్చే బ్యాంకు రుణాలను సులభతరం చేయాలని డిమాండ్ చేసింది. కొనుగోలు సామర్థ్యం పెరిగేలా, దేశీయ మార్కెట్‌ను విస్తరించాలని డిమాండ్ చేసింది.కాగా, ఈ సదస్సులో దాదాపు వెయ్యిమంది ప్రజలు, ఎంఎస్ఎంఈ పారిశ్రామిక వేత్తలు, కార్మికులు సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో స్పిన్నింగ్ మిల్లులు, పవర్లూమ్, కంప్రెసర్, కాయిర్, ప్లాంటేషన్, ప్లంబర్ తదితర 15 సంఘాల ఆఫీస్ బేరర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూ పారు. ఈ సదస్సులో తమిళనాడు ఎంఎస్ఎంఈ మంత్రి టిఎం అన్బరసన్, కేరళ పరిశ్రమల శాఖా మంత్రి పి.రాజీవ్ ప్రసంగించారు.
తమిళనాడు సీఐటీయూ అధ్యక్షులు ఎ సౌందరరాజన్ ముగింపు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ల సంస్థల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని, ఎంఎస్ఎంఈల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సదస్సు విమర్శించింది. ఈ సందర్భంగా సీఐటీయూ నేత కె. కనగరాజ్ తిక్కతీర్ వార్తాపత్రికతో మాట్లాడుతూ.. 'ఎంఎస్ ఎంఈలు ఎంతోమందికి ఉపాధిని అందిస్తున్నాయి. అయితే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నోట్ల రద్దు, జీఎస్టీ, కోవిడ్ వల్ల విధించిన లాక్డౌన్ల ద్వారా చిన్న పరిశ్రమలు సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. గత ఎనిమిదేండ్లలో బడా కార్పొరేట్లకు రూ. 8 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు. కానీ భారతీయ బ్యాంకులు ఎంఎస్ఎంఈలకు ఇచ్చే రుణాలు కేవలం 4 శాతం మాత్రమే.' అని ఆయన అన్నారు.