Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవేదన చెందుతూ రాహుల్‌గాంధీతో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కుమార్తె
- విదేశాల్లో ఉన్నాం..ప్రజాస్వామాన్ని బలోపేతం చేసేదెలా? అని ప్రశ్న
న్యూఢిల్లీ : భారత్‌లో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ప్రవాస భారతీయులు సైతం ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ బ్రిటన్ పర్యటనకు అనూహ్య స్పందన కనపడుతోంది. సోమవారం లండన్‌లో 'చాతాం హౌస్'లో వివిధ వర్గాలతో కలిసి రాహుల్‌గాంధీ భారత రాజకీయాలపై మాట్లాడారు. మీడియా ప్రముఖులు, ప్రవాస భారతీయులు, ఆయన మద్దతుదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కుమార్తె మాళినీ మెహ్రా భారత్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ''ప్రస్తుత నా దేశం అత్యంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. మా నాన్న ఒకనాడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త. తన దేశం గురించి గర్వపడేవారు. కానీ నేడు ఆ భావన నా తండ్రిలో లేదు. ప్రస్తుత భారత్‌ను ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. మనదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మేమంతా ఏం చేయాలి'' అని రాహుల్‌గాంధీని ఆమె ప్రశ్నించారు. ఆమె అభిప్రాయాన్ని స్వాగతిస్తూ రాహుల్‌గాంధీ, ''ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితిపై మీరు మాట్లాడారు. అందుకు మిమ్మల్ని అభినందించాలి. మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటమన్నది చాలా శక్తివంతమైంది. భారత్ కోల్పోయిన ప్రజాస్వామిక విలువల గురించి మీరు మాట్లాడారు'' అని అన్నారు.
ఆర్ఎస్ఎస్ కబంధ హస్తాల్లో ప్రజాస్వామ్యం
'చాతాం హౌస్'లో రాహుల్‌గాంధీ ప్రసంగిస్తూ ఆర్ఎస్ఎస్పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు సంస్థగా మారిందన్నారు. భారత్‌లోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఆక్రమించిందని, ప్రజాస్వామ్య స్వభావాన్ని మార్చిందనీ అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక రహస్య సమాజంగా పనిచేస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకొని రాజకీయ అధికారాన్ని కైవసం చేసుకుందని, అధికారం దక్కాక..ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేస్తోందన్నారు. మీడియా, న్యాయవ్యవస్థ, పార్లమెంట్, ఎన్నికల సంఘం..కీలకమైన రాజ్యాంగ సంస్థలన్నీ ప్రమాదంలో పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు.