Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50శాతం చేరడానికి మరో 80ఏండ్లు
- ప్రపంచ దేశాల చట్టసభల్లో పెరుగుతున్న మహిళా ప్రాతినిథ్యం
- ప్రతి నలుగురిలో ఒకరు మహిళా సభ్యురాలు : ఇంటర్ పార్లమెంటరీ యూనియన్
- భారత్‌లో అత్యంత నెమ్మదిగా లింగ సమానత్వం
న్యూఢిల్లీ : మహిళల ప్రాధాన్యత, చట్టసభల్లో వారి ప్రాతినిథ్యంపై పాలకుల ప్రసంగాలకు..వాస్తవ పరిస్థితికి పొంతన కుదరటం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోల్చితే మనదగ్గర చట్టసభల్లో మహిళల ప్రాతినిథ్యం నామమాత్రంగా ఉంటోంది. మహిళల ప్రాతినిథ్యం లోక్‌సభలో 14శాతం, రాజ్యసభలో 12శాతమే. మరోవైపు గల్ఫ్ దేశం యుఏఈ పార్లమెంట్లో 50శాతం మహిళలున్నారు. రువాండాలో 61శాతం, క్యూబాలో 53శాతం మహిళా ప్రాతినిథ్యముంది. లింగ వివక్ష, మహిళల హింసపై అవగాహన, చైతన్యం తీసుకురావటంతో కొలంబియా మెరుగైన ఫలితాల్ని సాధించింది. దిగువ సభకు జరిగిన ఎన్నికల్లో మహిళా సభ్యుల గెలుపు 10శాతం పెరిగింది. మనదగ్గర మాత్రం పార్టీలు తమ ప్రసంగాల్లో ఊదరగొడుతున్నా ఆచరణలో భిన్న వైఖరి కనబరుస్తున్నాయి.
అత్యంత పేలవం..బాధాకరం : ఇంటర్ పార్లమెంటరీ యూనియన్
ప్రపంచవ్యాప్తంగా చట్టసభల్లో ప్రతి నలుగురిలో ఒకరు మహిళా సభ్యురాలు ఉండగా, మనదగ్గర ఆ పరిస్థితి కనుచూపుమేరలో లేదు. చట్టసభల్లో 'లింగ సమానత్వం' అత్యంత పేలవంగా, బాధాకరంగా ఉందని 'ఇంటర్ పార్లమెంటరీ యూనియన్' వార్షిక నివేదిక అభిప్రాయపడింది. భారత్‌లో లింగ సమానత్వం అత్యంత నెమ్మదిగా కొనసాగుతోందని పేర్కొంది. 2011లో ఆయా దేశాల చట్టసభల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు మహిళా సభ్యురాలు ఉన్నారని, ఇప్పుడు వారి సంఖ్య పెరిగిందని తెలిపింది. నివేదికలో పేర్కొన్న మరికొన్ని విషయాలు ఈ విధంగా ఉన్నాయి.
80 ఏండ్లు పడుతుంది
ఇప్పుడున్న పురోగతి ప్రకారం భారత్‌లో లింగ సమానత్వం చేకూరాలంటే 80ఏండ్లు పడుతుంది. ఆయా రంగాల్లో మహిళల పురోగతి ద్వారా ఇటీవల అనేక దేశాలు ఎంతగానో ముందడుగు వేశాయి. గత ఏడాది 47 దేశాల్లో ఎన్నికలు జరిగాయి. ఏడు దేశాల్లోని దిగువ సభల్లో మహిళా సభ్యుల ఎన్నిక లేదా ఎంపిక కనీసం 40శాతం ఉంది. ఆస్ట్రేలియాలో మునుపెన్నడూ లేనివిధంగా సెనెట్‌కు జరిగిన ఎన్నికల్లో 56.6శాతం మంది ఎంపిక య్యారు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా మహిళా సభ్యుల ప్రాతిని థ్యంలో పెరుగుదల 0.4శాతంగానే ఉంది. దిగువ సభల్లో మహిళల ప్రాతినిథ్యం ఎక్కువగా నమోదైన దేశాలు, స్లొవేనియాలో 15శాతం, మాల్టాలో 13శాతం, ఈక్వటోరియల్ గినియాలో 11శాతం, కొలంబియాలో 10శాతం, ఆస్ట్రేలియాలో 7.9శాతం.
రువాండాలో 61శాతం
గత ఏడాది చివరి నాటికి 64దేశాల్లోని చట్టసభ స్థానాల్లో 30శాతం మహిళలు గెలుచుకున్నారు. అత్యధికంగా మహిళా పార్లమెంట్ సభ్యులున్న దేశంగా రువాండా 2008లోనే గుర్తింపు అందుకుంది. ఈదేశ పార్లమెంట్లో 61శాతం స్థానాలు మహిళలవే. క్యూబా-53శాతం, నికరాగువా 52శాతంతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. డొమినికా, చాద్, మాలి, ఉజ్బెకిస్తాన్..దేశాలు చట్ట సభల్లో మహిళల ప్రాతినిథ్యం పెంచటంలో ఇటీవల ఎంతగానో పురోగతి సాధించాయి. ఆయా దేశాల్లోని మంత్రివర్గంలో ఆరోగ్యం, కుటుంబం, సామాజిక సంబంధాలు, పర్యావరణం..కీలక స్థానాలు మహిళలతో భర్తీ చేస్తున్నాయి. మంత్రివర్గంలోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన దేశాలుగా స్పెయిన్, అల్బేనియా, రువాండా, కెనడా, ఫ్రాన్స్ ముందున్నాయి.