Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వంత సంపాదన ఉన్నా..ఆమెకు సాధికారత లేదు :ఇండియా లెండ్స్ సర్వే
- శ్రామిక మహిళల్లో 90 శాతం మంది ఇంటి కోసమే ఖర్చు..
న్యూఢిల్లీ : శ్రామిక మహిళల ఆర్థిక నిర్ణయాల్లో పురుషాధిక్యత బలంగా ఉన్నదని 'ఇండియా లెండ్స్' సర్వే పేర్కొంది. సమాజంలో ఉన్న అడ్డంకులు, సాంప్రదాయాలు దీనికి కారణమని సర్వే అభిప్రాయపడింది. వీటిని ఛేదించి 'శ్రామిక మహిళ' సమాన అవకాశాల్ని అందుకోవాల్సిన సమయం వచ్చిందని తెలిపింది. 90శాతం మంది మహిళలు తమ ఆదాయాల్ని ఇంటి కోసం ఖర్చుచేస్తున్నారని, ఖర్చుల విషయమై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు 67శాతం మంది భర్త లేదా తండ్రి లేదా సోదరుడిపై ఆధారపడుతున్నారని సర్వేలో తేలింది. తమ ఆదాయంలో 40 నుంచి 50శాతం మొత్తాన్ని ఇంటి కోసం ఖర్చు చేస్తున్నారని సర్వే తెలిపింది. వివిధ నగరాలకు చెందిన శ్రామిక మహిళలతో ఇంటర్వ్యూ జరిపిన 'ఇండియా లెండ్స్' ఈ గణాంకాల్ని విడుదల చేసింది. శ్రామిక మహిళల్లో దాదాపు సగం మంది సోషల్ మీడియా ద్వారా ఆర్థిక అంశాల్ని నేర్చుకుంటున్నారని, 30శాతం మంది వార్తా కథనాల నుంచి, 20శాతం మంది వర్క్‌షాప్‌లు, సెమినార్ల నుంచి నేర్చుకుంటున్నారని సర్వే కనుగొన్నది. శ్రామిక మహిళల్లో మూడింట ఒకవంతు మాత్రమే ఆర్థిక నిర్ణయాలన్నింటిపై నమ్మకంతో ఉన్నారు. ''మా సర్వేలో పాల్గొన్న మహిళల్లో 70శాతం మంది ఆదాయాలు రూ.5 లక్షల లోపున్నాయి. రూ.5లక్షల నుంచి రూ.10లక్షల మధ్య ఆదాయం గలవారు 23శాతం మంది ఉన్నారు. వీరంతా తమ ఆదాయంలో గరిష్ట భాగాన్ని ఇంటికోసం వినియోగిస్తున్నారు. అయినప్పటికీ 67శాతం మంది మహిళలు ఆర్థిక నిర్ణయాల్లో సాధికారతను కలిగిలేరు. ఆర్థిక అవసరాల కోసం భర్త లేదా తండ్రి లేదా సోదరుడిపై ఆధారపడుతున్నారు'' అని నివేదిక పేర్కొంది.
ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటంలో తమపై ఎవరి ప్రభావమూ లేదని 22శాతం మంది మహిళలు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామివేత్తలుగా మారాలని 25శాతం మంది తమ అకాంక్షను వ్యక్తం చేశారు. వృత్తిపరంగా మరింత ఎదగాలని, ఇందుకోసం తమ వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని మరో 25శాతం మంది చెప్పారు. తమ సర్వేపై 'ఇండియాలెండ్స్' సీఈవో గౌరవ్ చోప్రా మాట్లాడుతూ, ''మహిళలు తమ ఆర్థిక వ్యవహారాలను వారే చూసుకొనేలా సాధికారత కల్పించడం కేవలం నైతిక అవసరం మాత్రమే కాదు, ఆర్థిక అవసరం కూడా. సమాజంగా మనం సంప్రదాయ అడ్డంకులను ఛేదించి, అందరికీ సమాన అవకాశాలను కల్పించాల్సిన సమయం ఇది' అని చెప్పారు. నేడు ప్రతి ఇంటిలోని మహిళా ఆర్థిక అంశాల్ని తెలుసుకోవటంపై ఆసక్తితో ఉన్నారని అన్నారు.