Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవాళి పురోగతిలో మహిళలను సమాన భాగస్వాములుగా చేయాలి
- సుసంపన్నమైన సమాజ నిర్మాణానికి లింగ అసమానతలు రూపుమాపాలి : మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము శుభాకాంక్షలు
న్యూఢిల్లీ : మానవాళి పురోగతిలో మహిళలను సమాన భాగస్వాములుగా చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నొక్కి చెప్పారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించు కుని బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో అట్టడుగు స్థాయిలో నిర్ణయాధికార సంస్థల్లో మహిళలకు మంచి ప్రాతినిథ్యం ఉన్నదనీ, కానీ మనం పైకి వెళ్లే కొద్దీ ఆడవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నదని వివరించారు. దేశంలోని మహిళలది అలుపెరగని స్ఫూర్తిని వివరించారు. ''ప్రతి స్త్రీ కథ నా కథ'' అని పేర్కొంటూ సమాజంలో మహిళల స్థితిగతుల గురించి మాట్లాడారు.
''21వ శతాబ్దంలో మహిళలు అన్ని రంగాలలో అనూహ్యమైన పురోగతిని సాధించినప్పటికీ, ఇప్పటి వరకు ఏ మహిళ కూడా అనేక దేశాలలో రాష్ట్ర, ప్రభుత్వానికి అధిపతిగా మారలేదు'' అని పేర్కొన్నారు. ''ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాష్ట్రపతిగా నా ఎన్నిక మహిళా సాధికారత కథలో ఒక భాగం'' అని అన్నారు. నేడు లెక్కలేనంత మంది మహిళలు తాము ఎంచుకున్న రంగాల్లో పని చేస్తూ దేశ నిర్మాణానికి సహకరిస్తున్నారని అన్నారు. ''సమాజంలో ప్రబలంగా ఉన్న మనస్తత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. శాంతియుత, సుసంపన్నమైన సమాజాన్ని నిర్మించాలంటే, లింగ అసమానత ఆధారంగా పాతుకుపోయిన పక్షపాతాలను అర్థం చేసుకోవడం, విముక్తి పొందడం అవసరం'' అని పేర్కొన్నారు. మానవాళి పురోగతిలో మహిళలను సమాన భాగస్వాములను చేస్తే మన ప్రపంచం సంతోషకరమైన ప్రదేశంగా ఉంటుందని ద్రౌపది ముర్ము అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు పూర్తయ్యే వరకు 'అమృత్ కాల్' యువతుల కాలమని చెప్పారు. ''ఈ రోజు నేను మీ ప్రతి ఒక్కరినీ మీ కుటుంబంలో, ఇరుగుపొరుగు, కార్యాలయంలో మార్పు తీసుకురావడానికి మిమ్మల్ని మీరు సన్నద్ధం కావాలని కోరుతున్నాను. పిల్లల ముఖంలో చిరునవ్వు కలిగించే ఏదైనా మార్పు, ఆమె చేసే ఏదైనా మార్పు భావితరాలకు ఉజ్వల భవిష్యత్ నందిస్తోందని '' అని అన్నారు.