Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు సిఎం స్టాలిన్
చెన్నై : తమిళనాడులో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ బీజేపీ నేతలు ఇటీవల పుకార్లు సృష్టించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ జరిగిన 'ఉంగలిల్ ఒరువన్' అనే కార్యాక్రమంలో స్టాలిన్ మాట్లాడారు. కేంద్రంలో మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ప్రతిపక్షాల ఐక్యతకు పిలుపు ఇచ్చినందుకే బీజేపీ ఈ విధమైన కుట్రకు పాల్పడిందని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాల ఐక్యతకు తాను పిలుపునిచ్చిన మరుసటి రోజే బీజేపీ తమిళనాడులో అశాంతి సృష్టించేందుకు వదంతులు వ్యాప్తి చేసిందని ఆయన తెలిపారు.
దీనిని బట్టే దీని వెనుక ఉన్న కుట్ర అర్థమవుతుందన్నారు. తమిళనాడులో అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశ్యంతో ఉత్తర భారత్ చెందిన బీజేపీ నాయకులు ఈ కుట్రకు పాల్పడ్డారని విమర్శించారు. 'ఉత్తర భారత్ బీజేపీ నాయకులే ఈ కుట్రకు పాల్పడ్డారు. అక్కడి కార్మికులు ఇక్కడ ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారు. ఇటీవలకాలంలో వారి సంఖ్య పెరిగింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం. కానీ దాడి జరిగినట్లు కొందరు నకిలీ వీడియోలు సృష్టించారు' అని స్టాలిన్ తెలిపారు. ఈ వదంతుల వ్యాప్తి కేసులో తమిళనాడు బీజేపీ ఛీఫ్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.