Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీ, బీహార్‌లోని 15 ప్రాంతాల్లో తనిఖీలు
న్యూఢిల్లీ : 'ల్యాండ్ ఫర్ జాబ్ కేసు'లో బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ నివాసంలో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. న్యూఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో ఉన్న ఆర్జేడీ నాయకుడి నివాసంతోపాటు ముంబయి, యూపీ, బీహార్‌లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు చేపట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని సమాజ్‌వాదీ పార్టీ నేత జితేంద్ర యాదవ్ నివాసానికి కూడా ఈడీ అధికారులు చేరుకున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రాగిణి భర్త జితేంద్ర యాదవ్. ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం భూము లు తీసుకుందని 'ల్యాండ్ ఫర్ జాబ్' కేసులో అభియోగాలు నమోదయ్యాయి. లాలూ, ఆయన భార్య రబ్రీదేవిని కొద్ది రోజుల క్రితం సీబీఐ ప్రశ్నించింది. తాజా తనిఖీల్లో ఆయన కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఢిల్లీ నివాసం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. బీహార్, ఉత్తరప్రదేశ్, ముంబయిలోని ఆయన కుటుంబానికి చెందిన పదులకుపైగా ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. లాలూ సన్నిహితుడు, ఎమ్మెల్యే అబూ దోజానా ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా ఆధారాలను గుర్తించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్టు ఈడీ సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2004 నుంచి 2009 వరకు కేంద్రలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా..కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారిస్తోంది. ఇప్పుడు మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ సోదాలు నిర్వహించింది.