Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉధృత పోరాటాలే మార్గం
- ఏప్రిల్ 5న మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ
- సీఐటీయూ, ఎఐకెఎస్, ఎఐఎడబ్ల్యుయూ వెల్లడి
న్యూఢిల్లీ: ఉధృత పోరాటాల ద్వారానే ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమని సిఐటియు, అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్), అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం (ఎఐఎడబ్ల్యుయు) పిలుపునిచ్చాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, శ్రామిక వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, ధరల పెరుగుదలను అరికట్టాలని, ఆహారం, నిత్యాసవరాలపై జిఎస్టిని ఉపసంహరించాలని, సంపన్నులపై పన్ను వేయాలని, కార్పొరేట్ పన్నును పెంచి, సంపద పన్నును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశాయి. కార్మికులను, రైతాంగాన్ని కొల్లగొట్టడం ద్వారా అదానీ, అంబానీ వంటి కార్పొరేట్లకు అమృతకాలాన్ని అందించాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిఐటియు, ఎఐకెఎస్, ఎఐఎడబ్ల్యుయు నేతలు తపన్‌సేన్, విజూ కృష్ణన్, బి.వెంకట్ శనివారం ఒక సంయుక్త ప్రకటనలో విమర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలతో కార్మికుల రోజువారీ జీవితం దుర్భరంగా తయారైందని అన్నారు. ప్రజాస్వామ్య సంస్థలన్నీ కూడా ధ్వంసమవుతున్నాయని, ప్రజాతంత్ర హక్కులు కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్-బిజెపి కూటమి మతోన్మాద విషాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజలను విభజిస్తోందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం సాగుతున్న పోరాటాలను మరింత ఉధృతం చేయాలని సిఐటియు, ఎఐకెఎస్, ఎఐఎడబ్ల్యుయులు సంయుక్తంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఒకరిపట్ల మరొకరికి విద్వేషం, భయం లేని స్వేచ్ఛా వాతావరణం కావాలని, గౌరవం, భద్రతతో కూడిన జీవితాన్ని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 5న మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ నిర్వహించున్నాట్లు తెలిపారు. ఈ ర్యాలీని జయప్రదం చేసేందుకు రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశ నలుమూలల నుంచి ఢిల్లీ తరలివెళ్లి ర్యాలీని జయప్రదం చేయాలని కార్మికులు, రైతులతో సహా అన్ని తరగతుల ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.
సంఘర్స్్ ర్యాలీ ప్రధాన డిమాండ్లు
అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలి. కాంట్రాక్టీకరణ కాకుండా శాశ్విత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలి. స్కీమ్ వర్కర్లతో సహా కార్మికులందరికీ నెలకు రూ.10 వేల పెన్షన్ ఇవ్వాలి. కనీస వేతనం రూ.26 వేలు వుండాలి. గ్యారంటీ సేకరణతో అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు సి2 ప్లస్ 50 శాతం తో కనీస మద్దతు ధరకు చట్టబద్ధంగా హామీ కల్పించాలి. నిరుపేద, మధ్యతరగతి రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు వన్‌టైమ్ రుణాన్ని రద్దు చేయాలి. 60 ఏళ్లు పైబడిన వారందరికీ పెన్షన్ ఇవ్వాలి. కార్మిక చట్టాలను, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలి. అందరికీ ఉపాధి హామీ కల్పించాలి. గ్రామీణ ఉపాధి హామీని విస్తరించి, పని దినాలను 200 రోజులకు పొడిగించాలి.