Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ, సీబీఐ సోదాలపై లాలూ ట్వీట్
- బీజేపీ, ఆరెస్సెస్ ముందు ఎన్నడూ తల వంచలేదు
- వారిపై పోరాటం కొనసాగుతుందని స్పష్టీకరణ
న్యూఢిల్లీ: తన కుటుంబంపై ఈడీ దాడుల విషయంలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాల అనంతరం లాలూ, ఆయన రెండో కుమార్తె రోహిణి ఆచార్య లు బీజేపీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కుటుంబాన్ని వేధించడానికి, హింసించడానికే బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్నదని ఆరోపించారు. ''బీజేపీ, ఆరెస్సెస్‌తో నాకు సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. వారితో పోరాడుతున్నాను. ఆ పోరాటం కొనసాగుతుంది. వారి ముందు నేనెప్పుడూ తల వంచలేదు. నా కుటుంబ సభ్యులు కానీ, పార్టీ వ్యక్తులు కానీ ఎవరూ తల వంచలేదు'' అని లాలూ ప్రసాద్ యాదవ్ ట్వీట్ చేశారు. ''ఎమర్జెన్సీని చూశాం. అప్పుడూ పోరాడాం. ఈ రోజు నిరాధారమైన ప్రతీకార విషయంలో బీజేపీ ఈడీ నా కూతుర్లు, మనవళ్లు, మనవరాళ్లు, గర్భిణీ అయిన నా కోడలును 15 గంటల పాటు కూర్చోబెట్టింది. మాతో రాజకీయ పోరులో బీజేపీ ఇంత దిగజారిపోతుందా?'' అని మరొక ట్వీట్లో లాలూ ప్రశ్నించారు. శుక్రవారం ఈడీ.. తేజస్వీ యాదవ్, అతని ఇద్దరి సోదరీమణుల నివాసాలతో పాటు ఢిల్లీ, పాట్న, రాంచీ, ముంబయిలలోని 24కు పైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన విషయం విదితమే. ఈ సోదాల్లో రూ. 70లక్షల నగదు, 1.5 కేజీల బంగారం, 540 గ్రాముల గోల్డ్ బులియన్, విదేశీ కరెన్సీని స్వాధీనపర్చుకున్నట్టు అధికారులు వెల్లడించారు.