Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మానవ నిర్లక్ష్యమే : బాంబే హైకోర్టు స్పష్టీకరణ
ముంబయి: వాహనాల టైరు పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ (దైవేచ్చ) కాదని.. అది మానవ నిర్లక్ష్యమేనని బాంబే హైకోర్టు ఇటీవల స్పష్టం చేసింది. బాధిత కుటుంబానికి బీమా సంస్థ పరిహారం అందించాలని ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. కారు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం యాక్ట్ ఆఫ్ గాడ్ కిందకే వస్తుందని, పరిహారం చెల్లించలేమంటూ న్యూ ఇండియా అస్యూరెన్స్ చేసిన విజ్ఞప్తిని బాంబే హైకోర్టు తిరస్కరించింది.
ముంబయికి చెందిన పట్వర్ధన్ 2010 అక్టోబర్లో ఇద్దరు స్నేహితులతో కలిసి పూణె నుండి ముంబయికి కారులో వెళ్తున్నారు. డ్రైవర్ కారుని వేగంగా నడపడంతో కారు వెనక టైరు పేలడంతో కారు గుంతలో పడింది. ఈ ప్రమాదంంలో పట్వర్ధన్ మరణించారు. ఈ కేసును విచారించిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ పట్వర్ధన్ కుటుంబానికి రూ.1.25 కోట్ల రూపాయల పరిహారం అందించాలని న్యూ ఇండియా అస్యూరెన్స్ బీమా కంపెనీని 2016లో ఆదేశించింది. అతడి కుటుంబానికి అతనొక్కడే ఆర్థిక ఆధారమని వ్యాఖ్యానించింది. అయితే, ఆ పరిహారం చాలా అధికంగా ఉందని పేర్కొంటూ ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ బీమా సంస్థ బాంబే కోర్టులో అప్పీలు చేసింది.
వాహన టైరు పేలడం అనేది విపత్తు కిందకు వస్తుందని బీమా సంస్థ హైకోర్టులో వాదనలు వినిపించింది. ఈ వాదనను జస్టిస్ ఎస్.డి. డిగే ధర్మాసనం బీమా సంస్థ వాదనను నిరాకరించింది. టైరు పేలడం అనేది విపత్తు కిందకు రాదని.. అది నియంత్రించగలిగే చర్యేనని స్పష్టం చేసింది. అతివేగం, టైరులో గాలి హెచ్చు తగ్గులు లేదా సెకండ్ హ్యాండ్ టైర్, ఉష్ణోగ్రత వంటివి టైరు పేలడానికి కారణాలై ఉండవచ్చని పేర్కొంది. ప్రయాణానికి ముందు వాహనం డ్రైవర్ లేదా యజమాని టైర్ పరిస్థితిని తనిఖీ చేసి ఉండాల్సిందని, దీంతో ఇది మానవ తప్పిదం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది.