Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడుల్లో 84వేల ఉపాధ్యాయ కొలువులు ఖాళీ
- నాణ్యమైన విద్యను పొందలేకపోతున్న చిన్నారులు
- యోగి సర్కారుపై విద్యావేత్తల ఆగ్రహం
లక్నో : బీజేపీ పాలిత రాష్ట్రం యూపీలో టీచర్ల కొరత తీవ్రంగా ఉన్నది. బడుల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక అక్కడి పిల్లలు చదువులో వెనుకబడి పోతున్నారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో కలిపి మొత్తం 84వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే అసెంబ్లీలో వెల్లడించింది. యోగి సర్కారుకు హిందూత్వ వంటి మతరాజకీయాలు, గోరక్షణపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలోని బడుల్లో టీచర్ల పోస్టులను భర్తీ చేయడంపై లేదని సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలల హక్కు అయిన ఉచిత నిర్బంధ విద్య చట్టం (ఆర్టీఈ), 2009 కింద విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉండాలనే మార్గదర్శకాలు ఉన్నాయి. అయినప్పటికీ యోగి పాలనలో రాష్ట్రంలో అదేమీ కనిపించడం లేదని వారు చెప్పారు.
ఏప్రిల్1 నుంచే కొత్త విద్యాసంవత్సరం
వచ్చే నెల 1 నుంచి యూపీలో కొత్త విద్యా సంవత్సరం మొదలు కానున్నది. యూపీ రాష్ట్ర అసెంబ్లీలో సాక్షాత్తూ ఆ రాష్ట్ర విద్యా మంత్రి సందీప్‌సింగ్ రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను ధ్రువీకరించారు. మంత్రి తెలిపిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు బోధించే ప్రాథమిక మరియు ఉన్నతస్థాయి పాఠశాలల్లో దాదాపు 51వేల అసిస్టెంట్ టీచర్ల కొలువులు ఖాళీగా ఉన్నాయి. అయినప్పటికీ.. ఈ కొలువుల భర్తీకి కొత్తగా నియామక ప్రక్రియన ఉండబోదని మంత్రి సూచించడం గమనార్హం. ఇక 9 నుంచి 12వ తరగతులకు బోధించే ప్రభుత్వ, ప్రభుత్వేతర, ఏయిడెడ్ సెకెండరీ స్కూళ్లలో 33వేల బోధనాసిబ్బంది, ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సెకండరీ ఎడ్యుకేషన్ మినిస్టర్ వెల్లడించడం గమనార్హం.
'బీజేపీ సర్కారు అసత్యాలు'
రాష్ట్రంలోని బడుల్లో ఉపాధ్యాయుల కొరత ఉండటంతో విద్యార్థులు అనేక సబ్జెక్టుల్లో కావాల్సినంత జ్ఞానాన్ని పొందలేకపోతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు విషయంలో యోగి సర్కారు అలసత్వం ప్రదర్శిస్తున్నదన్నారు. టీచర్ల కొరత తీవ్రంగా ఉన్న కారణంగా ఉన్న ఉపాధ్యాయులను అన్ని సబ్జెక్టులు బోధించేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయని రాష్ట్రీయ శైక్షిక్ మహాసంఫ్‌ు (ఆర్ఎస్ఎం) అధికార ప్రతినిధి విరేంద్ర మిశ్రా అన్నారు. ఆర్టీఈ కింద ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది చిన్నారులకు ఒక టీచర్, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రతి 35 మందికి ఒకరు ఉండాలని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో (1 నుంచి 8వ తరగతి వరకు) 1.92 కోట్ల మంది విద్యార్థులున్నారని అంచనా. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1 లక్షకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండాలనీ, ప్రభుత్వం మాత్రం 51,112 పోస్టులే ఖాళీగా ఉన్నాయని అసత్యాలు చెప్తున్నదని విరేంద్ర మిశ్రా అన్నారు. టీచర్ల కొరత కారణంగానే రాష్ట్రంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.