Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముస్లింలు లక్ష్యంగా విద్వేష ప్రసంగాలు
- ముంబయి, థానె..సహా వివిధ నగరాల్లో లవ్ జిహాద్ ర్యాలీలు..
- సుప్రీంకోర్టు ఆదేశాల్ని అమలుజేయని బీజేపీ-శివసేన ప్రభుత్వం
- లౌకికవాదాన్ని హిందువులు విడిచిపెట్టాలి : ఎమ్మెల్యే రాజాసింగ్
బీజేపీ-శివసేన సర్కార్ అండదండలతో ఇటీవల మహారాష్ట్రలో హిందూత్వ శక్తులు పెట్రేగిపోతున్నాయి. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నాయి. ఆ వర్గం వారిపై హింసకు దిగాలంటూ హిందువుల్ని రెచ్చగొడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నగరాల్లో 'లవ్ జిహాద్ ర్యాలీ'ల పేరుతో హిందూత్వ గ్రూపులు చేపడుతున్న ప్రదర్శనలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. 'సకల్ హిందూ సమాజ్' అనే సంస్థ 'లవ్ జిహాద్ ర్యాలీ'లను చేపడుతోంది.
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం థానె పట్టణానికి సమీపంలో నెవాలీ వద్ద నిర్వహించిన ర్యాలీకు కాషాయ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యకర్తలను ఉద్దేశించి పలువురు వక్తలు ప్రసంగిస్తూ, ముస్లింలపై విద్వేషం వెళ్లగక్కారు. గత కొద్ది నెలలుగా నెవాలీ, లాతూర్, పర్భానీ, జల్గావ్, అహ్మద్‌నగర్, ముంబయి, బారామతి, నందుర్బార్ నగరాల్లో చేపట్టిన ర్యాలీల్లో విద్వేష ప్రసంగాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
దీనిపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ప్రధాన కార్యదర్శి లారా జెసానీ మాట్లాడుతూ, ''ముంబయిలో ఈ తరహా విద్వేష ప్రసంగాలు, ర్యాలీలు ఎప్పుడూ చూడలేదు. ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తూ 'లవ్ జిహాద్' ర్యాలీలు ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒక వర్గం వారిపై హింసకు దిగాలని బహిరంగంగా పిలుపు ఇస్తున్నారు'' అని ఆందోళన వ్యక్త చేశారు. పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా విద్వేష ప్రసంగాలు ఆగటం లేదని లారా జెసానీ చెప్పారు.
యోగిని చూసి నేర్చుకోండి : టి.రాజాసింగ్
''ఛత్రపతి శివాజీ పుట్టిన ఈ నేలపై మసీదులు ఉండాలా? హిందువులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు?'' అంటూ స్వామీ భరతానంద మహరాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పాల్ఘార్‌లోని హిందూ శక్తి పీఠాధిపతి అయిన ఆయన, ''లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌తో హిందువుల స్థలాల్ని, భూముల్ని ముస్లింలు ఆక్రమించారు'' అని అన్నారు. ర్యాలీకి హాజరైన తెలంగాణ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ మతపరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ''లౌకికవాదాన్ని విడిచిపెట్టాలని హిందువులను కోరుతున్నా. వారంతా హిందూ దేశం కోసం పోరాడాలి. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని చూసి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేర్చుకోవాలి. ముస్లింల ఇండ్లపైకి 100 బుల్డౌజర్లను పంపాడు. వారి ఇండ్లను కూల్చాడు'' అని అన్నారు. హోలి రంగుల్ని ముస్లిం దుకాణాదార్ల నుంచి కొనుగోలు చేయరాదని, హిందువుల దుకాణాల వద్దకే వెళ్లాలని, ఆర్థికంగా ఆ వర్గాన్ని బారుకాట్ చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చాడు.
సుప్రీం ఆదేశాలు బేఖాతరు
గత ఏడాది నవంబర్ నుంచి రాష్ట్రంలో 'లవ్ జిహాద్ ర్యాలీ'లు సాగుతున్నాయి. ప్రతిచోటా ముస్లింలను లక్ష్యంగా చేసుకొని విద్వేష ప్రసంగాలు చేయటం పరిపాటిగా మారింది. ముంబయిలో జనవరి 29న సకల్ హిందూ సమాజ్ చేపట్టిన ర్యాలీలో వక్తలు పెద్ద ఎత్తున విద్వేష ప్రసంగాలు చేశారు. ఈ విషయం సుప్రీకోర్టు వరకు చేరింది. ఇలాంటి ర్యాలీలకు ఇకపై అనుమతి ఇవ్వమని మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. తదుపరి ర్యాలీకి సంబంధించిన వీడియో రికార్డులను సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. విద్వేష ప్రసంగాలు వెలువడితే పోలీసులు వెంటనే జోక్యం చేసుకోవాలని, వారిని అరెస్టు చేయాలని చెప్పింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీం నుంచి ఆదేశాలు వచ్చినా, 'సకల్ హిందూ సమాజ్' ర్యాలీలు అలాగే కొనసాగుతున్నాయి. కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాక 11 ర్యాలీలు చేపట్టింది. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్, సనాతన్ సంస్థ, దుర్గా వాహిని, విశ్వ శ్రీరాం సేన, హిందూ రాష్ట్ర సేన, హిందూ జనజాగృతి సమితి, హిందూ ప్రస్తాన్కు చెందిన నాయకులు ర్యాలీల్లో పాల్గొంటూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు.