Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్‌గాంధీపై ప్రగ్యా ఠాకూర్ అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీని భారతదేశం నుంచి బయటకు వెళ్లగొట్టాలని బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యంపై విమర్శలు చేసిన ఆయనకు రాజకీయాల్లో చోటు ఇవ్వరాదని, విదేశీ మహిళకు జన్మించిన ఆయనకు దేశభక్తి లేదని పగ్యా ఠాకూర్ విమర్శించింది. బ్రిటన్ పర్యటనలో రాహుల్‌గాంధీ మోడీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌లో మునపటి ప్రజాస్వామ్యం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ ఒక రహస్య సంస్థగా మారిందని, రాజ్యాంగ వ్యవస్థల్ని కబలిస్తోందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతును అణగదొక్కుతోందని అన్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల దాడి మొదలైంది. విదేశాల్లో భారత్ గురించి మాట్లాడటమేంటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మాట్లాడుతూ, ''రాహుల్‌గాంధీ భారత్‌కు చెందిన పౌరుడు కాదని మేం భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన తల్లి ఇటలీకి చెందినవారు. విదేశాలకు వెళ్లి భారత్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేస్తారా? రాహుల్‌గాంధీకి ఈ దేశ రాజకీయాల్లో చోటు లేదు. ఇలాంటివాడ్ని దేశం నుంచి బయటకు వెళ్లగొట్టాలి. కాంగ్రెస్ మనుగడ పతనావస్థలో ఉంది. అందువల్లే ఆ పార్టీ నాయకుల మెదళ్లు కలుషితం అవుతున్నాయి'' అని అన్నారు.