Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు
- రాహుల్ వ్యాఖ్యలపై అధికార బీజేపీ
- వాయిదాల పర్వంలో ఉభయ సభలు
- లోక్‌సభలో రాజమండ్రి మాజీ ఎంపీ, సినీనటి జమునకు నివాళి
న్యూఢిల్లీ : అదానీ వ్యవహారం, కేంద్ర ఎజెన్సీల దుర్వినియోగం, లండన్‌లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. అదానీ వ్యవహారం, కేంద్ర ఎజెన్సీల దుర్వినియోగంపై ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టగా, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార బీజేపీ నిరసనకు దిగింది. రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతున్నదంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గతవారం లండన్‌లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలంటూ ఇటు లోక్‌సభలోనూ, అటు రాజ్యసభలోనూ అధికార పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రతిపక్షపార్టీల సభ్యులు వ్యతిరేకించటంతో ఉభయ సభల్లోనూ గందరగోళ వాతావరణం నెలకొన్నది. దీంతో ఉభయసభలు ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడ్డాయి. లోక్‌సభ ప్రారంభంకాగానే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. 'రాహుల్ గాంధీ లండన్‌లో ఇండియాను అవమానించారు. సభ్యులందరూ రాహుల్ ప్రకటనను ఖండించాలి. సభకు ఆయన క్షమాపణ చెప్పాలి' అన్నారు. దేశ అంతర్గత వ్యవహారాలపై విదేశీ జోక్యాన్ని రాహుల్ కోరారని ఆరోపించారు. దీనిని సభ్యులంతా ఖండించాలని అన్నారు. దీనిని ప్రతిపక్ష పార్టీల సభ్యులు వ్యతిరేకించారు. గతంలో మోడీ విదేశాల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేశారని గుర్తుచేశారు. అలాగే సభలో ఈడీ, సీబీఐ, ఐటీ దుర్వినియోగంపైన, అదానీ వ్యవహారంపైనా ప్రతిపక్షాలు నినాదాలు హోరెత్తించాయి. సభలో గందరగోళం నెలకొనటంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేసినా. సభలో మార్పు రాకపోవడంతో మంగళవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి
రాజ్యసభలోనూ ఇదే అంశంపై గందరగోళం చోటుచేసుకుంది. సభ ప్రారంభం అయిన వెంటనే కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఈ అంశాన్ని సభలో లెవనెత్తుతూ, భారత ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రజాసామ్యం ఏమైంది? చట్టాల ప్రతులను చించేసినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది? అప్పుడు ప్రజాస్వామ్యం పోయిందే కానీ, ఇప్పుడు కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గోయల్ వ్యాఖ్యలను రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే ఖండించారు. సభలో సభ్యుడు కాని వ్యక్తిని పిలిచి క్షమాపణ చెప్పాలని అడగడం ఏమిటని నిలదీశారు. 'ప్రజాస్వామ్యాన్ని అణచివేసి, నాశనం చేసే వారు ప్రజాస్వామ్యాన్ని, దేశ గౌరవాన్ని కాపాడాలని మాట్లాడుతున్నారు' అని విమర్శించారు. చట్టబద్ధమైన పాలన లేదనీ, అదానీ-హిండెన్‌బర్గ్ అంశం నుంచి దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనీ, తామంతా కలిసికట్టుగా ఉన్నామనీ, అదానీ అంశంపై జేపీసీని డిమాండ్ చేస్తూనే ఉంటామని చెప్పారు. దీంతో అధికార, ప్రతిపక్షాల నినాదాల మధ్య సభలో గందరగోళం నెలకొనడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైనా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది.