Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బలమైన వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు పిళ్లై స్టేట్మెంట్ మార్చుకున్నారు :ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన అరుణ్ రామచంద్ర పిళ్లై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడి మరో మూడు రోజులు పొడిగించారు. ఈడీ కస్టడీ సోమవారంతో ముగియ డంతో ఈడీ అధికారులు పిళ్లైని మరోసారి రౌస్ అవెన్యూలోని సీబీప్రత్యేక కోర్టులో హాజరు పర్చారు. దీంతో న్యాయస్థానం పిళ్లై కస్టడీని మరో మూడు రోజలు పొడిగించింది. ఇదే కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శనివారం విచారించిన ఈడీ అధికారులు 16వ తేదీన మళ్లీ విచారణకు రావాలని ఆమెను ఆదేశించారు. అంతకు ముందు రోజే (మార్చి 15న) కవిత ఆడిటర్ బుచ్చిబాబుతో కలిపి పిళ్ళైను విచారించనున్నారు. కవిత విచారణ రోజు వరకూ పిళ్లై కస్టడీ పొడిగించడంతో ఆమెతో కలిపి విచారణ జరిపే అవకాశం ఉన్నది. మరోవైపు ఈడీ తన వద్ద తీసుకున్న వాంగ్మూలాన్ని ఉపసంహరించు కునేందుకు అవకాశం ఇవ్వాలని పిళ్లై సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై సోమవారం విచారణ జరిగింది. ఇప్పటికే ఈడీ 29 సార్లు పిళ్ళైని విచారణకు పిలిచి 11 సార్లు స్టేట్మెంట్ రికార్డు చేసిందని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిళ్ళై ఇప్పటికే ఈ కేసు విచారణకు సహకరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇతర నిందితులతో కలిపి ప్రశ్నిస్తే... విచారణలో న్యాయవాది కూడా ఉండాలని పిళ్ళై తరపు న్యాయవాది కోర్టును కోరారు. గత వారం కస్టడీతో కలిపి 36 సార్లు పిళ్ళై కేసు విచారణకు హాజరయ్యరని చెప్పారు. హౌటల్ రికార్డులు చూపించి మద్యం కేసు పిళ్ళైకి ఆపాదించాలని చూస్తున్నారని పిళ్ళై తరఫు న్యాయవాది వాదించారు. అయితే కీలక సమయంలో వాంగ్మూలాల ఉపసంహరణ కోసం అప్లికేషన్ దాఖలు చేశారని ఈడీ తరపు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. పిళ్ళై విచారణకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ, ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. విచారణ సమయంలో పిళ్ళై తోపాటు ఆయన న్యాయవాదికి అనుమతి ఇవ్వాలన్న వాదనను వ్యతిరేకించిన వ్యతిరేకించారు.
ఇప్పుడు స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటా మంటున్నారని, కానీ బలవంతం చేసి పిళ్ళై స్టేట్మెంట్ రికార్డు చేయలేదని కోర్టు దృష్టికి ఈడీ తీసుకెళ్లింది. పిళ్ళై వాంగ్మూలం రికార్డ్ చేసేందుకు అన్ని నిబంధనలు పాటించామనీ, భయపెట్టి, బలవంతం చేసి పిళ్ళై వాంగ్మూలం తీసుకోలేదని స్పష్టం చేసింది. మొదటి సారి గతేడాది సెప్టెంబర్ 18న పిళ్ళై స్టేట్మెంట్ రికార్డు చేశామని, ముడుపుల వ్యవహారంలో పిళ్ళై కీలకపాత్ర పోషించారని, ముడుపుల్లో ప్రధాన పాత్రదారి పిళ్ళై అని ఈడీ న్యాయస్థానానికి స్పష్టం చేసింది. పిళ్ళై, బుచ్చిబాబు కలిసి మద్యం పాలసీ రూపకల్పనలో భాగస్వాములు గా ఉన్నారని, బుచ్చిబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా పిళ్ళైని, బుచ్చిబాబును ప్రశ్నించాల్సి ఉందని ఈడీ తెలిపింది. న్యాయవాదుల సమక్షంలో పిఎంఎల్ఎ సెక్షన్ 50 ప్రకారం నిందితుల విచారణ జరగదన్న ఈడీ స్పష్టం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 18న పూర్తి స్టేట్మెంట్ నమోదు చేశామని, రెండోసారి, మూడో దఫా ఇచ్చిన వాగ్మూలంలో కూడా వివరాలను ఖరారు చేశారని ఈడి తెలిపింది. పిళ్లైని టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్మెంట్లో అవే విషయాలను ఎలా కన్ఫర్మ్ చేస్తారని ఈడీ ప్రశ్నించింది. మార్చి తరువాతే స్టేట్మెంట్ మార్చుకున్నారని, ఎందుకు మార్చుకున్నారో తెలుసని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. బలమైన వ్యక్తిని విచారణకు పిలిచినప్పుడు పిళ్లై తన స్టేట్మెంట్ మార్చుకున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది.