Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభలో వాయిదా తీర్మానాలు..
- గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం
- మద్యం కుంభకోణం పేరుతో రాజకీయం: ఎంపీ కేకే
న్యూఢిల్లీ :దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని దేశంలో బీజేపీ రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన చేపట్టారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఆరోపిస్తూ సోమవారం పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపచేసే ప్రయత్నం చేశారు. తొలుత పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దర్యాప్తు సంస్థల తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎంపీలు అనంతరం ఉభయ సభల్లో ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని పట్టుబట్టారు. ఉభయ సభల్లోనూ కార్యకలాపాలను అడ్డుకొనేందుకు ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభా కార్యకలాపాలను తొలుత మధ్యాహ్నం 2 గంటలకు అనంతరం మంగళవారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ చైర్మెన్, లోక్‌సభ స్పీకర్లు వాయిదా వేశారు. అనంతరం విజరుచౌక్లో బీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్‌లతో కలిసి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు మీడియాతో మాట్లాడారు.
రాజకీయం చేసేందుకే ....
ఎంపీ కేకే మాట్లాడుతూ దేశంలో దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలతో పాటు గవర్నర్లను తమకు అనుకూలంగా మార్చుకొని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అవకతవకలను అడ్డుకొనేందుకు పార్లమెంట్ వేదికపై పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నడిపిస్తామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపై నడిచి బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు. గత నెలగా దేశంలో సీబీఐ, ఈడీని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వినియోగిస్తుందన్న అంశాన్ని లేవనెత్తి పోరాటం చేస్తున్నామన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో గత ఏడాది సెప్టెంబర్‌లో తొలి అరెస్టు జరిగినప్పటికీ, కావాలని రాజకీయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేసును పొడిగిస్తోందని కేకే ఆరోపించారు. ఈ కేసులో దర్యాప్తు, విచారణ గురించి ఎవరూ భయపడట్లేదనీ... సీబీఐ, ఈడీ సంస్థలు చట్టం ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కల్వ కుంట్ల కవిత ఇంటికి వెళ్లి విచారణ జరిపేందుకు అవకాశం ఉన్నప్పటికీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిజాన్ని రాబట్టేందుకు విచారణకు ఉన్న అవకా శాన్ని ఎందుకు వినియోగించుకోలేదని ప్రశ్నించారు. మద్యం కుంభకోణం కేసును రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో ఈడీ అధికారులు గత శనివారం విచారణ పేరుతో ఢిల్లీలో తమాషా చేశారని కేకే మండిపడ్డారు. అంతేగాక అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీకి, అదానీకి ఉన్న సంబంధాలన్నీ బహిర్గతం కావాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని తాము ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ప్రయత్నం
ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, గత తొమ్మిదేండ్లుగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒక మాదిరిగా.. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను మరో మాదిరిగా చూస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా సహా ఇతర అంశాల ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, మా నిధులు మాకు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గళం విప్పారన్నారు. అప్పటినుంచి ప్రధాని మోడీ.. సీఎం కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమ ర్శించారు. అంతేగాక కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఆలోచనతో మోడీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కవితపై ఈడీని ఉసిగొల్పారన్నారు. ఈడీ, సీబీఐ వంటి ఏ దర్యాప్తు సంస్థ బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ వెనుకాడేది లేదనీ... ప్రజాస్వామ్యయుతంగా, న్యాయబద్ధంగా తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీ లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు.