Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు బెయిల్ మంజూరుపై సుప్రీంకు కర్నాటక లోకాయుక్త
- విచారణకు సర్వోన్నత న్యాయస్థానం ఓకే
న్యూఢిల్లీ : కర్నాటక సబ్బులు, డిటర్జెంట్లు (కేఎస్డీఎల్) ఒప్పందం కుంభకోణంలో రాష్ట్ర హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందిన బీజేపీ ఎమ్మెల్యే మడల్ విరూపాక్షప్పకు షాక్ తగిలింది. హైకోర్టు బెయిల్‌ను సవాలు చేస్తూ కర్నాటక లోకాయుక్త వేసిన పిటిషన్‌ను విచారించడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం ఆమోదం తెలిపింది. ఈ పిటిషన్‌పై తక్షణమే విచారణ జరపాల్సిందిగా కర్నాటక లోకాయుక్త సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరింది. అయితే, దీనిపై విచారించడానికి కుదరదనీ, జస్టిస్ సంజరు కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు దీని గురించి ప్రస్తావించాలని సీజేఐ సూచించారు. దీంతో వెంటనే జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం వద్దకు వెళ్లిన లోకాయుక్త న్యాయవాది.. పిటిషన్‌పై తక్షణమే విచారణ జరపాలని కోరారు. ఇది బెయిల్ రద్దుకు సంబంధించిన అంశమనీ, సాధ్యమైనంత త్వరగా విచారిస్తామని జస్టిస్ సంజరు కౌల్ తెలిపారు.
కుమారుడి అరెస్టుతో అప్రమత్తమై..
కేఎస్డీఎల్ కార్యాలయంలో తన తండ్రి తరఫున రూ. 40 లక్షల ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ప్రశాంత్ మడల్ను లోకాయుక్త పోలీసులు ఈనెల 2న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన బీజేపీ ఎమ్మెల్యే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తన కుమారుడి అరెస్టుతో విరూపాక్షప్ప కేఎస్డీఎల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. ప్రశాంత్ మడల్ అరెస్టు తర్వాత వారి ఇండ్లు, కార్యాలయాల్లో జరిపిన సోదాల్లో లోకాయుక్త పోలీసులు రూ. 8.23 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. ఈ ఏడాది మే నెలలో కర్నాటకలో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్కాం వ్యవహారం బీజేపీకి ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్పారు.