Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిపక్ష నాయకులే టార్గెట్...ఈడీ, సీబీఐ కేసుల పేరుతో వేధింపులు..
- ప్రతిపక్ష నాయకుల్ని ఒంటరి చేయాలన్నదే ఎజెండా : సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ : ప్రతిపక్ష నాయకులను వేధించటమే లక్ష్యంగా ఈడీ, సీబీఐలను కేంద్రం ప్రయోగిస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆయా కేసుల్లో ఇరుక్కున్నవారికి బీజేపీలో చేరగానే..కేసుల నుండి విముక్తి ఎలా కలుగుతోందని ప్రశ్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత 9ఏండ్లుగా ప్రతిపక్ష నాయకులపై నమోదైన కేసుల్లో నేర నిరూపణ రేటు ఎంతుందో బయటపెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ''కేంద్ర దర్యాప్తు సంస్థలకు మేం వ్యతిరేకంగా కాదు. కానీ గత 9ఏండ్లుగా ఈడీ నమోదుచేసిన కేసుల్లో నేర నిరూపణ రేటు ఎంతుందో ? గమనించాలి. ఇది 0.5శాతం మాత్రమే. చట్టాన్ని అతిక్రమించారని కేంద్ర దర్యాప్తు సంస్థలు భావిస్తే, న్యాయస్థానాల్లో ఎందుకు నిరూపించటం లేదు?''అని ప్రశ్నించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
బీజేపీలో చేరితే కేసులుండవు..
ఇప్పుడు ఈడీ దాడులు, సీబీఐ కేసులు..అంటే ప్రతిపక్ష నాయకులని వేధించటం తప్ప మరోటి కాదు. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయటం, ప్రతిపక్ష నాయకుల్ని ఒంటరి చేయటం మోడీ సర్కార్ ఎజెండా. ఈ ఎజెండా కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా అమలవుతోంది. కేసులు నమోదైన తర్వాత కొంతమందిబీజేపీలో చేరటంతో, వారిపై కేసులు కనిపించకుండా పోతున్నాయి.
రాజకీయ పొత్తులపై...
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాకే పొత్తులు, రాజకీయ కూటములు ఉంటాయని ఏచూరి అన్నారు. యూపీఏ-1 సర్కార్ అలాగే ఏర్పాటైందన్నారు. గత 9ఏండ్లుగా దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతింటోందన్నారు. మన ప్రజాస్వామ్యం ఎన్నికలు, ఓట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. ఈ పాలనలో ప్రజలకు జవాబుదారీతనం లేదు. అదానీ-హిండెన్‌బర్గ్ అంశమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయకపోవటం కేంద్రం తన బాధ్యతను విస్మరించటమే. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినప్పుడల్లా ప్రతిపక్షాలు ఒక్కటవుతాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని అన్నారు.