Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖాళీలను భర్తీ చేయాలి
- డీఎను విడుదల చేయాలి
- కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య ఆందోళన
- ఉద్యోగుల సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతాం : ఎలమారం కరీం
న్యూఢిల్లీ : కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతామని సీపీఐ(ఎం) రాజ్యసభ పక్ష నేత ఎలమారం కరీం అన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణకు స్వస్తి పలకాలనీ, ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలనీ, పద్దెనిమిది నెలలుగా నిలుపుదల చేసిన డీఏ విడుదల చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల సమాఖ్య మంగళవారం జంతర్ మంతర్ వద్ద పార్లమెంట్ మార్చ్‌ను చేపట్టింది. ఈ మార్చ్‌ను సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం ప్రారంభించారు. మినిమమ్ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ నినాదాన్ని ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం, ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా ప్రయివేటు శక్తులకు అప్పగిస్తున్నదని విమర్శించారు. రైల్వేలు పూర్తి ప్రయివేటీకరణ అంచున ఉన్నాయని అన్నారు. డీఏ పెంచాలని డిమాండ్ చేస్తూ బెంగాల్లో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు దిగా రనీ, మహారాష్ట్రలో నిరవధిక సమ్మె ప్రారంభమైందని అన్నారు. కార్మిక సమ స్యలను లేవనెత్తే వేదికైన ఇండియన్ లేబర్ కాన్ఫెరెన్స్ ఎప్పుడూ జరగదనీ, ప్రధాని మోడీకి కార్మికుడనే పదం కూడా వినిపించటంలేదని అన్నారు. లేబర్ కోడ్లతో పారిశ్రామిక రంగంలో కేంద్రం ఇదే విధమైన హానికరమైన విధానాన్ని అనుసరిస్తున్నదని విమర్శించారు. బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలతో పాటు వారి వర్గ రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడాలని అన్నారు. దేశ సంపదకు అసలైన నిర్మాతలైన శ్రామిక సమాజం దేశం కోసం ఐక్యంగా నిలబడాలని ఎలమారం కరీం పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఎ. శ్రీకుమార్ అధ్యక్షత వహించారు. సీఐటీయూ జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధు, నేతలు ఆర్. ఎన్ పరేషర్, సుభాష్ లాంబా, శిస్కాంత్ రారు, తపన్ బోస్, జనార్దన్ మజ్జుందార్ తదితరులు మాట్లాడారు.