Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర్నాలో ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
న్యూఢిల్లీ : దేశంలో దళితులు, ఇతర సామాజిక అణచివేతకు గురైన వర్గాలపై దాడులకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు నిర్వహించాలని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ పిలుపు ఇచ్చారు. మంగళవారం నాడిక్కడ జంతర్ మంతర్లో దళిత్ శోషణ్ ముక్తి మంచ్ (డీఎస్ఎంఎం), అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, డీఎస్ఎంఎం ఢిల్లీ కార్యదర్శి నత్తు ప్రసాద్ ప్రసంగించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో దళితులు, సమాజంలోని ఇతర అట్టడుగు వర్గాలపై పెరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తారు. దళితులు, ఆదివాసీలు, మహిళలు వంటి అణగారిన వర్గాల కోసం ఉపాధి హామీ, ఇతర బడ్జెట్ కేటాయింపుల రూపంలో ఆర్థిక అన్యాయాలను ఎత్తి చూపారు. ఉమ్మడి పోరాటం ఆవశ్యకతను తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగంపై దాడులు పెరిగాయనీ, దీనిని ప్రతిఘటించాలని స్పష్టం చేశారు.
దళితులు, సమాజంలోని ఇతర సామాజికంగా అణగారిన వర్గాలపై పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని అన్నారు. దేశంలోని దళితులు, అణగారిన వర్గాల సంక్షేమానికి సంబంధించిన అనేక ఇతర డిమాండ్లతో పాటు ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ అమలు, కుల గణన, అట్రాసిటీ నిరోధక చట్టాన్ని మెరుగ్గా అమలు చేయడం వంటి డిమాండ్లను ఈ ఆందోళన తీర్మానించింది. దేశంలో దళితులపై పెరుగుతున్న అఘాయిత్యాలు అధికార ఆర్ఎస్ఎస్-బీజేపీ అనుసరిస్తున్న మనువాద రాజకీయాలకు అద్దం పడుతోందన్న వాస్తవాన్ని ఎత్తిచూపుతూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆర్ఎస్ఎస్-బీజేపీల మత, కులతత్వ పాలనను ఓడించేందుకు ఒక సమగ్ర సామాజిక, ఆర్థిక ఎజెండాతో ఐక్య పోరాటానికి పిలుపునిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది.