Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జంతర్ మంతర్‌లో వైఎస్ షర్మిల ఆందోళన
- పార్లమెంట్ ముట్టడికి యత్నం...అరెస్టు
న్యూఢిల్లీ : కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరపాలని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్టీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అనంతరం పార్లమెంట్ ముట్టడికి షర్మిల యత్నించగా, ఢిల్లీ పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఆమెతో పాటు వైఎస్ఆర్టీపీ నేతల ను కూడా అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని అన్నారు. 2జీ, కోల్ గేట్ కుంభకోణాల కంటే ఇదే పెద్దదని పేర్కొన్నారు. రూ.1.20లక్షల కోట్ల ప్రజాధనం కాళేశ్వరంలో పోశారని, ఇందులో వేలాది కోట్లు కెసిఆర్ దోచుకున్నారని విమర్శించారు. 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి, 1.5లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని అన్నారు. 1.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చామని స్వయాన మంత్రే అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టుకు చేసిన వ్యయం కోసం కేంద్ర సంస్థలైన పవర్ కార్పొరేషన్ రూ.38వేల కోట్లు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ రూ.30వేల కోట్లు, పీఎన్బీ రూ.11వేల కోట్లు, నాబార్డ్, ఇతర సంస్థలు కలిపి రూ.20వేల కోట్ల వరకు రుణాలు ఇచ్చాయని తెలిపారు. ఈ సొమ్మంతా దేశ ప్రజలదేనని,అందుకే ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిబంధనలన్నీ గాలికి వదిలేశారని, కేసీఆర్ ఈ ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి, ప్రాజెక్టు వ్యయాన్ని మూడు రెట్లు పెంచి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. రూ.1600 కోట్లతో కొను గోలు చేసిన మోటార్లకు రూ.7వేల కోట్ల లెక్కచూపారని, రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు, రూ.1.20లక్షల కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. దీనిపై కేసీఆర్ సమాధానం చెప్పాలనీ, ప్రతి ప్యాకేజీలో అవినీతి జరిగిందని అన్నారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోస్తామని చెప్పి, అర టీఎంసీ కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కేసీఆర్, మెగా కంపెనీకి అమ్ముడుపోయాయని ఆరోపించారు.