Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో ఉద్యోగుల నిరవధిక సమ్మె
- స్తంభించిన కార్యకలాపాలు
ముంబయి : పాత పెన్షన్ పథకాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో ప్రభుత్వ ఉద్యోగులు మంగళవారం నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించారు. క్లాస్ 3, 4 ఉద్యోగులు, బోధనా, బోధనేతర సిబ్బందిలో చాలామంది విధులకు హాజరు కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య రంగ సేవలు, పాఠశాలలు, కాలేజీలు స్తంభించాయి. ఉద్యోగుల డిమాండ్‌ను పరిశీలిస్తామని చెబుతూనే సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీనిపై తక్షణమే ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఇందులోని ఆర్థికపరమైన ఆంశాలను అధ్యయనం చేయకుండా ఎలాంటి హామీలు ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతున్నది. మెజారిటీ ఉద్యోగులు సమ్మెలో వున్నారని వార్తలందుతున్నాయి. 17లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం రావాల్సి వుంది. తమ డిమాండ్లు నెరవేరేవరకు నిరసన, ఆందోళనలు కొనసాగుతాయని ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సాధర్య కమిటీ కన్వీనర్ విశ్వాస్ కట్కార్ చెప్పారు. సమ్మె కారణంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభిం చిపోయాయి. ఈ నిరవధిక సమ్మెలో జిల్లా పరిషత్, మున్సిపల్ కౌన్సిల్ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. దీనికి తోడు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా మంగళవారం మధ్యాహ్నం అజాద్ మైదాన్‌లో బీఎంసీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. కాగా, ఉద్యోగులు సమ్మెను ఉపసంహరించగలరని ఆశిస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ మనుకుమార్ శ్రీవాస్తవ తెలిపారు. పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలన్న డిమాండ్ అమలుపై అధ్యయనం చేయడానికి అధికారులతో కూడిన పాలనాపరమైన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.