Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్ ఆవరణంలో దద్దరిల్లిన నినాదాలు
- స్తంభించిన పార్లమెంట్
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నేతలు భారీ మానవహారం చేపట్టారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని మానవహారం నిర్వహించారు. మోడీ సర్కార్, అదానీ అక్రమాలకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. దీంతో పార్లమెంట్ ఆవరణం దద్దరిలింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, డీఎంకే ఎంపీ టిఆర్ బాలు, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, సీపీఐ(ఎం) ఎంపీలు ఎలమారం కరీం, ఎఎం ఆరీఫ్, సీపీఐ ఎంపీ బినరు విశ్వం, జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్, శివసేన (ఠాక్రే వర్గం) నేతలు ప్రియాంక చతుర్వేది, అరవింద్ సావంత్, బీఆర్ఎస్ ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, ఆప్ ఎంపీ సంజరు సింగ్, ఆర్ఎల్డీ ఎంపీ జయంత్ చౌదరి, కేరళ కాంగ్రెస్ ఎంపీ మణితో సహా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం మల్లిఖార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ అదానీ విషయంలో విచారణకు జేపీసీ ఏర్పాటుచేయాలని ప్రతిపక్షాలన్నీ పట్టుబడుతుండటంతో.. ఆ అంశాన్ని పక్కదోవ పట్టించాలనే కుట్రతోనే బీజేపీ నాయకులంతా రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలంటూ కొత్త ఎత్తుగడ వేశారని విమర్శించారు. అదానీ గ్రూప్‌పై విచారణకు ప్రతిపక్షాలన్ని ఒకేతాటిపైకి వచ్చాయనీ, తన ప్రియ మిత్రుడు అదానీని కాపాడేందుకు ప్రధాని మోడీ ప్రయత్నించడం దురదృష్టక రమని ఎంపీ గౌరవ్ గొగోరు అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తడానికి ప్రతిపక్ష నేతలకు అనుమతి లేదనీ, తమ మైకులు ఆఫ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. అంతకు ముందు ఖర్గే కార్యాయలయంలో ప్రతిపక్ష పార్టీల సమావేశం జరిగింది. కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆప్, ఆర్జేడీ, బీఆర్ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ, శివసేన (ఠాక్రే వర్గం), జేడీయూ, జేఎంఎం, ఎండీఎంకే, వీసీకే, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్, ఆర్ఎస్పీ సహా పలు ప్రతిపక్ష పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
స్తంభించిన పార్లమెంట్
అదానీ వ్యవహారం, రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్ స్తంభించింది. ఇదే అంశంపై పార్లమెంట్ ఉభయసభల్లోనూ అధికార, ప్రతిపక్షాలు ఆందోళన నాలుగో రోజు కూడా కొనసాగింది. అదానీ వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలని ప్రతిపక్షసభ్యులు పట్టుపట్టగా.. లండన్ చేసిన వ్యాఖ్యల పై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార బీజేపీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్చోపచర్చలు లేకుండానే ఉభయసభలు నేటికి (శుక్రవారం) వాయిదా పడ్డాయి.