Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోదానీ సర్కార్ సిగ్గు, సిగ్గు అంటూ నినాదాల హోరు
న్యూఢిల్లీ : అదానీ కుంభకోణంపై జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళనను ఉధృతం చేశాయి. గత నాలుగు రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనల్లో భాగంగా శుక్రవారం సత్యాగ్రహం చేపట్టాయి. పార్లమెంట్ ఆవరణంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరిగిన సత్యాగ్రహంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు అన్ని పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. ప్లకార్డులు చేబూని 'అదానీ సర్కార్ సిగ్గు సిగ్గు, జేపీసీ విచారణ జరపాలి, ఎల్ఐసీ, ఎస్బీఐను కాపాడాలి' అంటూ నినాదాలు హోరెత్తించారు. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఎస్పీ, ఆప్, జేడీయూ, బీఆర్ఎస్, సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ, శివసేన (ఠాక్రే), ఎన్సీపీ, జేఎంఎం, ఎండీఎంకే, వీసీకే, ఆర్ఎస్పీ, ఆర్ఎల్డీ, కేరళ కాంగ్రెస్(ఎం), ఐయూఎంఎల్ తదితర పార్టీలకు చెందిన ఎంపీలు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.
నిమిషాల్లో ఉభయ సభలు వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు నిమిషాల్లో సోమవారం (మార్చి 20) నాటికి వాయిదా పడ్డాయి. శుక్రవారం అధికార, ప్రతిపక్షాలు ఆందోళనలతో ఉభయ సభలు స్తంభించాయి. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) చేత దర్యాప్తు చేయించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లండన్‌లో దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారనీ, ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ బీజేపీ సభ్యులు సభ లోపల, వెలుపల ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పార్లమెంటులో చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. రాహుల్ గాంధీని చూసి బీజేపీ భయపడుతోందన్నారు. అంతకుముందు రాజ్యసభలో కేంద్ర మంత్రి వి. మురళీధరన్ జాతీయ జూట్ బోర్డుకు ఎన్నికల నిర్వహణ కోసం ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికుల రద్దీని సజావుగా నిర్వహించేందుకు అనేక చర్యలను అమలు చేస్తున్నట్టు పార్లమెంటుకు తెలిపారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ప్రధాని మోడీ, మంత్రి పియూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు కెసి వేణుగోపాల్, శక్తిసిన్హ్ గోహిల్ ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు.
ఉభయసభల్లో 3,382 నిమిషాలు అంతరాయం
పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన ఐదు రోజుల్లో 3,382 నిమిషాల పాటు పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం జరిగింది. అధికార, ప్రతిపక్షాల ఆందోళనతో మొదటి వారం కార్యకలాపాల మొత్తం తుడిచిపెట్టుకుపోయాయి. దీంతో కేవలం 218 నిమిషాల పాటు మాత్రమే సభా కార్యకలాపాల నిర్వహణ జరిగింది.
లోక్‌సభ ఈవారం ఐదు పనిదినాల్లో షెడ్యూల్ చేయబడిన 1,800 నిమిషాల్లో కేవలం 65 నిమిషాలు మాత్రమే పని చేసింది. అత్యల్పంగా గురువారం రెండు నిమిషాలు కంటే కొంచెం ఎక్కువ సమయం మాత్రమే జరిగింది. రాజ్యసభ 1,800 నిమిషాల్లో 152 నిమిషాల పాటు పని చేసింది. అత్యధికంగా ఆస్కార్ విజేతలను సత్కరించడానికి, అత్యల్పంగా గురువారం కేవలం నాలుగు నిమిషాల సమయమే పని చేసింది.