Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థిని హత్యపై ఆందోళన
- పోలీసు కాల్పుల్లో మరో విద్యార్థి బలి
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో గిరిజన విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారని ఆరోపిస్తూ గిరిజనులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. వారికి న్యాయం చేయడానికి బదులు పోలీసులు కాల్పులు జరిపి, మరో గిరిజన విద్యార్థిని బలిగొన్నారు. మరో కార్మికుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇండోర్‌లోని మౌ వద్ద ఈ దారుణం జరిగింది. రాష్ట్రంలోని ఖర్గోన్ జిల్లా మండ్లెశ్వర్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని గురువారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. మౌకు చెందిన యదునందన్ పాటీదార్, మరికొంతమంది విద్యార్థినిని అపహరించి, సామూహిక అత్యాచార.ం చేసి, హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. నేరస్తులకు పోలీసులు అండగా ఉంటున్నారని, ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని విమర్శిస్తూ మౌలో విద్యార్థిని మృతదేహంతో గురువారం రోడ్డుపై ఆందోళనకు దిగారు.
వారిపై టియర్ గ్యాస్, లాఠీలు ఉపయోగించి చెదరగొట్టడంతోపాటు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిర్వహించారు. తరువాత అంత్య క్రియలు నిర్వహించారు. పోలీసు చర్యతో మరింత ఆగ్రహానికి గురైన సుమారు 500 మంది గిరిజనులు, విద్యార్థులు గురువారం రాత్రి 9:30 గంటల సమయంలో మరోసారి మౌ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. వారిపై పోలీసులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 18 ఏళ్ల విద్యార్థి బెరూలాల్ మృతి చెందాడు. అటుగా వెళ్తున్న ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డారు.
అట్టుడికిన అసెంబ్లీ
పోలీసులు కాల్పుల అంశం శుక్రవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను కుదిపివేసింది. ఉత్తర ప్రదేశ్‌లో హత్రాస్ ఘటనలో మాదిరిగానే ఇక్కడ కూడా నేరస్తులకు వంతపాడుతూ, మృతదేహానికి బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించారని కాంగ్రెస్ విమర్శించింది. విద్యార్థిని ఛాతీలో ఎందుకు కాల్చారని ప్రశ్నించింది. యువతికి, నిందితుడికి పరిచయం ఉందని, వేడినీటిని మరిగిస్తుండగా విద్యుత్ షాక్‌తో మరణించిందని కూడా చెబుతున్నారని హోం మంత్రి అన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ వాకౌట్ చేసింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.