Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ను సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ చేయడంపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుతూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. గత ప్రభుత్వ ఏర్పాటు సమయంలో మహారాష్ట్రలో గవర్నర్ పాత్రకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై ఈ ట్రోలింగ్ జరుగుతోంది. ''ఇటువంటి ఆన్లైన్ ట్రోలింగ్, న్యాయానికి సంబంధించిన కార్యాచరణలో దారుణంగా జోక్యం చేసుకోవడమే'' అని రాష్ట్రపతికి రాసిన లేఖలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వివేక్ థంకా పేర్కొన్నారు. దోషులపై తక్షణమే చర్య తీసుకోవాలని ఆయన కోరారు. ఈ విషయంలో ఆయనకు పలువురు ప్రతిపక్ష ఎంపీలు మద్దతిచ్చారు. కాంగ్రెస్ సభ్యులు దిగ్విజరు సింగ్, ప్రమోద్ తివారి, శక్తిసిన్హ్ గోహిల్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, అమీ యాగ్నిక్, రంజిత్ రంజన్, ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, శివసేన (యుబిటి) సభ్యులు ప్రియాంక చతుర్వేది, ఆప్‌కి చెందిన రాఘవ చద్దా, ఎస్పికి చెందిన రామ్ గోపాల్ యాదవ్, జయ బచ్చన్ మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.
ఈ లేఖ ప్రతిని న్యాయ శాఖ మంత్రికి, ఐటి శాఖ మంత్రికి, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కి పంపారు. భారత అటార్నీ జనరల్‌కు కూడా ఇదే అంశంపై వారు ఫిర్యాదు చేశారు. ట్రోలింగ్‌కు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని థంకా డిమాండ్ చేశారు. న్యాయ యంత్రాంగాన్ని, భారత న్యాయమూర్తిని అత్రిష్టపాల్జేసేలా ట్రోల్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆ లేఖలో వారు కోరారు.మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, గవర్నర్ పాత్ర విషయంలో కీలకమైన రాజ్యాంగపరమైన అంశాలపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన వైఖరిని స్పష్టం చేసింది. టోలర్లు గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తిపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేయడంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. మహారాష్ట్రలో పాలక పార్టీ ప్రయోజనాల పట్ల సానుభూతి చూపే ట్రోల్ ఆర్మీ చేసే ఈ ట్రోలింగ్స్‌కు సామాజిక మాధ్యమాల్లో లక్షలాది వ్యూస్ వస్తున్నాయి. ఆ ట్రోలింగ్‌లో వాడే మాటలు, ఇతర సమాచారం అత్యంత దుర్భరంగా వున్నాయి. న్యాయస్థానం పరిధిలో వున్న అంశంపై ఇలా మాట్లాడుతున్నారంటే అటువంటి వారికి కచ్చితంగా పాలక పార్టీ మద్దతు, తోడ్పాటు వుంటుందని ఆ లేఖ పేర్కొంది.