Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిరాతక హత్యలపై ఐద్వా ఆందోళన
న్యూఢిల్లీ : కాశ్మీర్‌లోని బుద్గామ్‌లో యువతిని దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అందుకు కారకులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఐద్వా డిమాండ్ చేసింది. ఈ నెల 7న అరిఫా జాన్ కోచింగ్ క్లాస్‌కు వెళ్లిందని, తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో బుద్గామ్కి చెందిన షబీర్ అహ్మద్ వనీ ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి, వేర్వేరు చోట్ల పాతిపెట్టినట్లు తేలింది. ఇటీవల అనేకమంది మహిళలు ఇలానే దారుణంగా హత్యకు గురవుతున్నారని ఐద్వా పేర్కొంది. దీనిని నిరసిస్తూ స్థానికులు ప్రదర్శనలు నిర్వహించారు. కాశ్మీర్ మహిళా సమాఖ్యకు చెందిన ప్రతినిధి బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. ఈ కిరాతక హత్యను తీవ్రంగా ఖండించింది. ఇటువంటి హేయమైన నేరానికి పాల్పడినవారికి కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేసింది. మహిళల కిడ్నాప్‌లు, అత్యాచారాలు, అనూహ్యమైన రీతిలో హత్య చేయడం వంటి నేరాలు చాలా ఎక్కువైపోతున్నాయని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించింది. బాధిత కుటుంబానికి సరైన రక్షణ కల్పించి, హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐద్వా డిమాండ్ చేసింది.
మైనారిటీలపై దాడులకు ఖండన
వేధింపులు, బెదిరింపులకు పాల్పడే లక్ష్యంతో మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని, వారిపై దాడులకు దిగడం పట్ల ఐద్వా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో చోటు చేసుకున్న మత విద్వేషాన్ని తీవ్రంగా ఖండించింది. రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు గతేడాది డిసెంబరు నుంచి మహారాష్టలో సంఘపరివార్‌కి చెందిన కొంతమంది ప్రయత్నిస్తున్నారు. లవ్ జిహాద్, గో హత్యలు వంటి అంశాలను మైనారిటీ వర్గానికి ముడిపెట్టి వారిని హత్య చేయాలని పిలుపులిస్తున్నారు. ఈ ప్రసంగాలతో మైనారిటీలపై హింస, వివక్ష పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం ఇదంతా చూస్తూ మౌనంగా వూరుకుంటోందని ఐద్వా విమర్శిం చింది. ఈ విద్వేష ప్రచారాన్ని అన్ని వర్గాల ప్రజలు ప్రతిఘటించాలని కోరింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా శాంతి భద్రతల యంత్రాంగాన్ని కోరింది.