Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబై సరిహద్దులకు చేరిన యాత్ర
- సుదీర్ఘ పోరాటానికి మహారాష్ట్ర రైతులు సిద్ధం
ముంబయి : అకుంఠిత దీక్షతో వేలాదిమంది మహారాష్ట్ర రైతులు నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ ముంబయి సరిహద్దులకు చేరుకుంది. తమ పాదాలకు గాయాలవుతున్నా.. కాళ్ల నుంచి రక్తం కారుతున్నా.. లెక్క చేయకుండా అన్నదాతలు ఉద్యమ స్ఫూర్తితో దాదాపు 250 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చేవరకూ సుదీర్ఘ పోరాటం చేసేందుకైనా సిద్ధమని చెబుతున్నారు. ముంబయి సరిహద్దులోని వషీంద్ వద్ద ఉన్న ఈద్గా మైదాన్‌కు రైతులు చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన చారిత్రాత్మక రైతు ఉద్యమం తరహాలో టెంట్లు వేస్తున్నారు. శుక్రవారానికి 10 టెంట్లు వేశారు. మరిన్ని టెంట్లను సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో సాంస్కృతిక బృందం కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రైతు నాయకులు వివరిస్తున్నారు. యాత్రలో గిరిజన సంఘాల సభ్యులు, ఆశా కార్యకర్తలు పాల్గొంటున్నారు. పాదయాత్ర ప్రతినిధుల బృందంతో మహారాష్ట్ర మంత్రుల బృందంతోపాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పటికే కొన్నిసార్లు చర్చలు జరిపారు. రైతుల సంక్షేమానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చెప్పినా రైతులు విశ్వాసం వ్యక్తం చేయడం లేదు. తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి కచ్చితమైన హామీ రావాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పని ప్రారంభించారని అనిపిస్తేనే మహా యాత్రను విరమిస్తామని రైతులు తేల్చిచెబుతున్నారు. 2018లో లాంగ్ మార్చ్ తరువాత తమని ప్రభుత్వం ఎలా మోసం చేసిందో ఇంకా గుర్తుందని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు హెచ్చరిస్తున్నారు. అధికారులకు ప్రభుత్వం సరైన ఆదేశాలు జారీ చేసేవరకూ ఉద్యమం కొనసాగుతుందని సీపీఐ(ఎం) నాయకులు, మాజీ ఎమ్మెల్యే జెపి గవిత్ తెలిపారు.