Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ హామీలపై ఇకనైనా దృష్టి
- పోలవరానికి రూ.10 వేల కోట్లు ఇవ్వాలి
- మోడీ, అమిత్‌షాతో జగన్ భేటీ
న్యూఢిల్లీ : ''రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లైనా ఇప్పటి వరకు రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. వీటిపై వెంటనే దృష్టి సారించాలి'' అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. పార్లమెంట్‌లోని ప్రధాన మంత్రి కార్యాలయంలో ప్రధాని మోడీతో సిఎం ఏకాంతంగా భేటీ అయ్యారు. దాదాపు 35 నిమిషాల పాటు భేటీ సాగింది. అనంతరం సిఎం జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సుమారు 30 నిమిషాలపాటు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో ఆయన చర్చించారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో కమిటీ వేసినప్పటికీ, కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయని తెలిపారు. 2014-15 నాటి రెవెన్యూ లోటు కింద పెండింగ్‌లో ఉన్న రూ.36,625 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సిఎం కోరారు. రుణ పరిమితిని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని, పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చు చేసిన రూ.2,600.74 కోట్లు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని, ఈ బకాయిలను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు అంచనాలను సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన రూ.55,548 కోట్లను వెంటనే ఆమోదించాలని కోరారు. తాగునీటి సరఫరా అంశాన్ని కూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వారీగా నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేశారు. ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని, ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. నగదు బదిలీ (డిబిటి) పద్ధతిలో ముంపు బాధితులకు పరిహారమందిస్తే జాప్యాన్ని నివారించవచ్చని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10వేల కోట్లు మంజూరు చేయాలని కోరారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతుబద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. దీనివల్ల పిఎంజికెఎవై కార్యక్రమం కిందకు రాని 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇవ్వడం వల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోందని తెలిపారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా అభిప్రాయపడిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్‌కు ఖనిజ కొరత లేకుండా ఎపిఎండిసికి గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.