Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత్తు మందు ఇచ్చి లైంగిక దాడులు
- ఆస్ట్రేలియాలో 'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ' సభ్యుడి దుశ్చర్య
న్యూఢిల్లీ : మహిళల పట్ల బీజేపీ నాయకులు ప్రవర్తించే తీరు ఎలాంటిదో మరొక ఘటన రుజువు చేసింది. 'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ' ఆస్ట్రేలియా వింగ్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బాలేశ్ ధన్ఖర్.. గతంలో తప్పుడు ఉద్యోగ ప్రకటనలతో ఐదుగురు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. వారికి మత్తు మందు ఇచ్చి లైంగికదాడులకు తెగబడ్డాడు. రహస్య కెమెరాలతో రికార్డింగ్ చేయడం, అసభ్య దాడులకు దిగడం వంటివి చేశాడు. ఈ ఆరోపణలపై బాలేశ్ ధన్ఖర్ ఆస్ట్రేలియాలో ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నాడు.
పేరు బయటకు రాకుండా నాలుగేండ్లుగా ప్రయత్నాలు
బ్రిటీష్ డైలీ మెయిల్ కథనం ప్రకారం.. లైంగికదాడికి సంబంధించి 13 కేసులు, లైంగికదాడికి పాల్పడాలనే ఉద్దేశంతో మహిళలకు మత్తు మందును ఇవ్వడంపై ఆరు కేసులు, అనుమతి లేకుండా ఏకాంత దృశ్యాలను రికార్డ్ చేయడానికి సంబంధించి 17 కేసులు, అసభ్య దాడి ఆరోపణలపై మూడు.. ఇలా మొత్తం 39 కేసులను ధన్ఖర్ ఎదుర్కొంటున్నాడు. అయితే, ఈ దారుణాలు 2018లో జనవరి నుంచి అక్టోబర్ మధ్య చోటు చేసుకున్నాయి.
హోటల్‌కు తీసుకెళ్లి మహిళలపై అఘాయిత్యం
ఆస్ట్రేలియన్ వార్తా సంస్థ ''సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్'' కథనం ప్రకారం.. కొరియన్ నుంచి ఇంగ్లీషులోకి అనువాదకులు కావాలంటూ ధన్ఖర్ తప్పుడు ప్రకటనలు సైట్లో పోస్టు చేశాడు. ఈ విషయాన్ని అక్కడి పోలీసులు ధ్రువీకరించారు. ఇలా ప్రకటనను చూసి వచ్చిన మహిళలను సిడ్నీలోని తన అపార్టుమెంటుకు దగ్గరలో ఉండే హిల్టన్ హోటల్ బార్‌కు తీసుకెళ్లేవాడు. అదే హోటల్, కేఫ్, కొరియన్ రెస్టారెంట్లో మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడు. హిల్టన్ హోటల్లో మహిళలపై జరిపిన లైంగికదాడులను రికార్డ్ చేయడానికి రహస్య కెమెరాలు పెట్టాడు. బాధిత మహిళలకు పానియాల్లో మత్తు మందులు కలిపాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అలాగే, ధన్ఖర్ జరిపిన అసభ్య దాడులకు సంబంధించిన సమగ్ర రికార్డులనూ పోలీసులు కనుగొన్నారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను ధన్కర్ ఎదుర్కొంటున్నాడు.
మాకు సంబంధం లేదన్న సంస్థ..
ఇప్పటికీ వెబ్సైట్లో ధన్ఖర్ పేరు
ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (ఓఎఫ్‌బీజేపీ) అనేది బీజేపీకి మద్దతుగా నెలకొల్పిన సంస్థ. దీనికి సంబంధించిన ఆస్ట్రేలియా శాఖను ధన్ఖర్ స్థాపించాడు. అయితే, ధన్ఖర్పై ఆరోపణల నేపథ్యంతో ఓఎఫ్‌బీజేపీ ఆస్ట్రేలియా స్పందించింది. తమ సంస్థకు ధన్ఖర్ 2018 జులైలోనే రాజీనామా చేశాడని ఓఎఫ్‌బీజేపీ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. అతని చర్యలను ఖండిస్తున్నట్టు తెలిపింది. అయితే, ఇప్పటికీ ఆ సంస్థ అధికారిక వెబ్సైట్లో వ్యవస్థాపక సభ్యుడిగా ధన్ఖర్ పేరుండటం గమనార్హం.
మోడీ పాల్గొన్న కార్యక్రమంలో కీలక పాత్ర
మోడీని కలవడంపై ధన్ఖర్ తరచూ గొప్పగా చెప్పుకునేవాడనీ, మోడీతో అతను దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేవాడని కొన్ని వార్తా కథనాలు తెలిపాయి. హిందూ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా తరఫున పలు కార్యక్రమాల్లో ధన్ఖర్ మాట్లాడారని వివరించాయి. 2014లో ప్రధాని మోడీ రిసెప్షన్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించాడని తెలిపాయి.