Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శిక్షణ పార్లమెంటరీ కమిటీకి రాహుల్ వివరణ
న్యూఢిల్లీ : దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టత నిచ్చారు. దేశ ప్రజాస్వామ్యంపైనే తాను ప్రశ్నలు లేవనెత్తాననీ, దేశాన్ని అవమానించ లేదనీ, దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశాల జోక్యాన్ని తాను కోరలేదని రాహుల్ వివరణ ఇచ్చారు. జీ-20కి భారదేశం అధ్యక్షత వహిస్తుండటంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ సంప్రదింపుల (కన్సల్టేటీవ్) కమిటీ ముందు రాహుల్ ఈ వివరణ ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బీజేపీ ఎంపీ ఒకరు రాహుల్ పేరు ప్రస్తావించకుండా ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించడంతో సమావేశంలో అధికార, ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం చోటుచేసుకునట్టు తెలిసింది. విదేశాల్లో దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారనీ, 1975లో విధించిన అత్యవసర పరిస్థితి కంటే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద మచ్చ మరొకటి ఉండదని బీజేపీ ఎంపీ వ్యాఖ్యానించారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక, బిలియనీర్ జార్జి సోరోస్, గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ వంటివి భారతదేశ ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాలేనని ఎంపీ అన్నారు.విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా హాజరైన ఈ సమావేశంలో భారత్ జీ20 అధ్యక్ష పదవిపై చర్చ జరిగింది. సమావేశం ప్రారంభంలో జీ-20 అధ్యక్ష పదవిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వివరణాత్మక ప్రెజెంటేషన్‌ను ఇచ్చారు. దీన్ని తిలకించిన రాహుల్ గాంధీ ఆ తరువాత మాట్లాడుతూ, తన ప్రత్యర్థులు ఇటు పార్లమెంటులోను, పార్లమెంటు వెలుపల ప్రచారం సాగిస్తున్నట్టుగా తాను ఎలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఇది అంతర్గత విషయమని తాను నమ్ముతున్నాననీ, దీనిని ఇక్కడే పరిష్కరించుకుంటామని అన్నారు. అంతేతప్ప దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని ఏ దేశాన్ని కోరలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ కొందరు వక్రీకరించి చెబుతున్న మాటలేనని వివరణ ఇచ్చారు. హిండెన్‌బర్గ్ నివేదక ఒక వ్యక్తికి వ్యతిరేకంగా చెప్పినదే కానీ, ఇండియాపై దాడి కాదని అన్నారు. దీనిపై రాహుల్‌కు ప్రతిపక్ష ఎంపీ ఒకరు మద్దతుగా నిలబడ్డారు. రాహుల్ తన వివరణ కొనసాగిస్తుండగా, బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. వేరే ఉద్దేశం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంకేదో అంశం ప్రస్తావించడం సరికాదని వారు తప్పు రరరపట్టారు. అయితే, అధికార పార్టీ ఎంపీలే ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు, దానిపై స్పష్టత ఇచ్చే హక్కు ప్యానెల్ సభ్యుడికి ఉంటుందంటూ ప్రతిపక్ష ఎంపీలు రాహుల్‌కు మద్దతు పలికినట్టు సమాచారం. దీంతో ఈ అంశాన్ని ఇక్కడ కాకుండా పార్లమెంటులో మాట్లాడాలని జైశంకర్ రాహుల్‌కు సూచించారు. కొందరు ఇక్కడే ప్రశ్న లేవనెత్తినప్పుడు దానిపై తాను వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని రాహుల్ అన్నారు.