Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళలపై లైంగికదాడులంటూ 'భారత్ జోడో యాత్ర'లో ఆయన చేసిన వ్యాఖ్యల పర్యవసానం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అగ్రనాయకుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఇంటికి ఢిల్లీ పోలీసులు వెళ్లారు. 'మహిళలు ఇప్పటికీ లైంగిక దాడులకు గురవుతు న్నారు' అంటూ 'భారత్ జోడో యాత్ర'లో భాగంగా జనవరి 30న శ్రీనగర్‌లో ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఢిల్లీ పోలీసులు తాజా చర్యకు ఉపక్రమించారు. ఈ విషయంలో ఢిల్లీ పోలీసు బృందం రాహుల్‌ను ఆయన ఇంటికి వెళ్లి మరీ ప్రశ్నించింది. బాధితురాళ్ల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు, వారికి రక్షణ కల్పించేందుకు గానూ వారి వివరాలను అందించాలని రాహుల్‌ను అడిగినట్టు అధికారులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఢిల్లీ పోలీసుల చర్యపై స్పందించిన రాహుల్.. గతంలో ఇలా ఎన్నడూ జరగలేదనీ తెలిపారు. శ్రీనగర్‌లో జనవరి 30న చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఢిల్లీ పోలీసుల ఆకస్మిక ఆవశ్యకతను ఆయన ప్రశ్నించారు. సమగ్ర స్పందనను తెలియజేసేందుకు 8 నుంచి 10 రోజుల సమయాన్ని రాహుల్ కోరారు. సాయంత్రం నాలుగు గంటల లోపు ఢిల్లీ పోలీసులకు నాలుగు పేజీలతో కూడిన ప్రాథమిక స్పందనను రాహుల్ పంపారు. అదానీ అంశంపై పార్లమెంటులో లోపల, వెలుపల తీసుకున్న వైఖరికి దీనికి ఏమైనా సంబంధం ఉన్నదా? అని ఆయన అందులో అడిగారు. బీజేపీ, ఇతర రాజకీయ పార్టీల విషయంలోనూ ఇలాగే ప్రశ్నించారా? అని పేర్కొన్నారు.
రాహుల్ ఇంటికి మూడోసారి
శాంతి భద్రతల విభాగం ప్రత్యేక పోలీసు కమిషనర్ సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం అత్యంత పటిష్టమైన భద్రతా ప్రాంతమైన తుగ్లక్‌లేన్‌లోని ఆయన ఇంటికి ఉదయం పది గంటలకు చేరుకున్నది. దాదాపు రెండు గంటల తర్వాత రాహుల్‌ను పోలీసు బృందం చేరగలిగింది. మధ్యాహ్నం 1 గంటలకు రాహుల్ ఇంటి నుంచి పోలీసు బృందం బయటకు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ దగ్గరకు పోలీసులు రావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
కాంగ్రెస్ కార్యకర్తల నిరసన
పోలీసు బృందం రాహుల్ ఇంటిలోపలికి వెళ్లిన సమయంలో కాంగ్రెస్ నాయకులు పవన్ ఖేరా, అభిషేక్ మను సింఘ్వి, జైరామ్ రమేశ్, ఇతర ముఖ్య నాయకులు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాహుల్ ఇంటి బయట నిరసనకు దిగి, పోలీసు చర్యకు వ్యతిరేకంగా నినాదాలు వినిపించారు. ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి తర్వాత విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు.
రాహుల్‌కు వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించేందుకే : కాంగ్రెస్
ఐదు రోజుల వ్యవధిలోనే పోలీసులు మూడు సార్లు రాహుల్ గాంధీ ఇంటి తలుపు తట్టడంపై కాంగ్రెస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఢిల్లీ పోలీసుల చర్యను ఖండించింది. ఈ మేరకు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్, జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీలు పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. రాహుల్‌కు వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని సృష్టించాలన్న రాజకీయ దురుద్దేశంతో మోడీ సర్కారు బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నదంటూ వారు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలన్నిటినీ బీజేపీ తోసిపుచ్చింది. పోలీసులు వారి న్యాయపరమైన విధిని నిర్వర్తిస్తున్నారని ఉద్ఘాటించింది. రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేపిస్తూ కేంద్రం వాటిని దుర్వినియోగం చేస్తున్నదని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న విషయం విదితమే. ఇటు రాహుల్ యూకేలో చేసిన ప్రసంగంపై క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తున్నది. ఈ తరుణంలోనే ఢిల్లీ పోలీసు బృందం రాహుల్ ఇంటికి వెళ్లి మరీ ప్రశ్నించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.