Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూపీలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామన్న సర్కార్..
లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, విద్యుత్ ఉద్యోగులకు మధ్య ఆదివారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో విద్యుత్ సమ్మెను విరమిస్తున్నామని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్లో విద్యుత్ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు గురువారం రాత్రి 10 గంటల నుంచి సమ్మెకు దిగాయి. దీంతో పలు ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం నాటికి వెయ్యి మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దాదాపు ఒక లక్ష మందికిపైగా ఉద్యోగులు సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రాష్ట్ర విద్యుత్ మంత్రి ఎ.కె.శర్మ, మరికొంత మంది నాయకులకు ఉద్యోగ సంఘాల నేతలకు మధ్య ఆదివారం పలు దఫాలుగా చర్చలు నడిచాయి.
తమ డిమాండ్ల పరిష్కారంపై సానుకూలంగా స్పందించారని, దాదాపు 72గంటలుగా సాగిన సమ్మెను విరమిస్తున్నామని 'విద్యుత్ కర్మాచారి సంయుక్త సంఘర్ష సమితి' కన్వీనర్ శైలేంద్ర దూబే ప్రకటించారు. ''హైకోర్టు ఆదేశాల్ని, ముఖ్యమంత్రి యోగి, ఇతర మంత్రుల విజ్ఞప్తులను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రజల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకొని ఒక రోజు ముందుగానే సమ్మెను ముగించాం. మా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది'' అని శైలేంద్ర దూబే చెప్పారు.
విద్యుత్ సమ్మెకు అన్ని ఉద్యోగ సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. కేంద్రం, యూపీ ప్రభుత్వాలు విద్యుత్ ప్రయివేటీకరణ చర్యలను నిలిపివేయకపోతే దేశవ్యాప్త సమ్మెగా మారుతుందని శైలేంద్ర దూబే హెచ్చరించారు. యూపీ విద్యుత్ యాజమాన్యాలు తమ ఉద్యోగులతో చేసుకున్న ఒప్పందాలను అమలుచేయకుండా, నియంతృత్వంతో వ్యవహరిస్తే పరిస్థితి మరింత క్లిష్టతరమవుతుందని అన్నారు. విద్యుత్ సమ్మెను దెబ్బతీయడానికి యోగి ప్రభుత్వం 'ఎస్మా'ను కూడా ప్రయోగించింది. ఉద్యోగులు విధుల్లోకి రాకపోతే 'జాతీయ భద్రతా చట్టా'న్ని ప్రయోగిస్తామని బెదిరించింది. ఈ సమ్మె ప్రకటించిన తర్వాత యోగి ప్రభుత్వం 1332 మంది కాంట్రాక్ట్ వర్కర్లను విధుల నుంచి తొలగించింది. విద్యుత్ సరఫరా కట్ చేయటంతో గ్రేటర్ నోయిడాలో ఇద్దరు మంత్రులు హాజరైన కార్యక్రమాలు..చీకట్లోనే కొనసాగించాల్సి వచ్చింది.