Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో బీజేపీ వింత ధోరణి
- యూకేలో రాహుల్ ప్రసంగమే సాకు
- క్షమాపణలకు అధికార పార్టీ డిమాండ్
- నిరసనలు, నినాదాలతో ప్రతిపక్షంపై ఎదురుదాడి
- అదానీ, ఇతర సమస్యలను పక్కదారి పట్టించే వ్యూహం : రాజకీయ విశ్లేషకులు
దేశంలో అదానీ అంశం మొదలుకుని అధిక ధరల వరకు.. భారత్ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. వీటిపై పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నది. అయితే, మోడీ సర్కారు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ తమ బాధ్యతను విస్మరిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకపక్షమే ప్రతిపక్షంగా మారి ఎదురుదాడికి దిగుతున్నదని అంటున్నారు.
న్యూఢిల్లీ : పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం గొంతును మోడీ సర్కారు ఉద్దే శపూర్వకంగా అణచివేస్తోంది. ప్రతిపక్ష నాయకుల గొంతు బయటి ప్రపంచానికి వినిపించకుండా చేస్తున్నది. ఇందుకు యూకేలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని సాకుగా వాడుకుంటున్నది. రాహుల్ క్షమాపణలు చెప్పాలని రభస సృష్టిస్తున్నది. పార్లమెంటులో చోటు చేసుకుంటున్న ఘటనలపై రాజకీయ విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదానీ విషయంలో మోడీ సర్కారుపై వస్తున్న ఆరోపణలు, దేశం ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై కేంద్రం వద్ద సరైన సమాధానాలు లేవనీ.. అందుకే ఇలాంటి కుయుక్తులకు మోడీ సర్కారు దిగుతున్నదని అభిప్రాయపడుతున్నారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లోని పార్లమెంటులో ఇలాంటి అంతరాయాలు చాలా అరుదు. సాధారణంగా ప్రతిపక్షాల డిమాండ్లతో సభలకు అంతరాయం కలగటం సర్వసాధారణం. కానీ, పాలకపక్షమే సభను ముందుకు సాగనీయకపోవడం శోఛనీయమనీ, ఇలా చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థమేమున్నదని వారు ప్రశ్నిస్తున్నారు.
భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నదనీ, పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుల మైకులను కట్ చేశారని యూకేలో చేసిన ఆరోపణలపై రాహుల్ క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ డిమాండ్ చేస్తున్నది. అంతటితో ఆగకుండా రాహుల్‌ను సభ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ ఎంపీలు కోరడం గమనార్హం. అయితే, విదేశీ గడ్డపై భారత్‌కు సంబంధించిన వ్యవహారాల గురించి మోడీ కూడా అనేక సందర్భాలలో ప్రస్తావించిన ఘటనలు ఉన్నాయనీ, ఈ విషయాన్ని బీజేపీ నాయకుల మరిచిపోకూడదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఆత్మరక్షణ కోసం పార్లమెంటులో ఇలాంటి స్వల్పకాలిక రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నదని ఆరోపిస్తున్నారు. పార్లమెంటును ఎలాంటి ఆటంకం కలిగించకుండా నడపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదనీ, అయితే సభ నడవకపోవడంపై ప్రభుత్వం ఏ మాత్రమూ ఆందోళన చెందినట్టుగా కనిపించడం లేదని చెప్తున్నారు.
పార్లమెంటులో సమస్యలు చర్చకు రాకపోవడం ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పును కలిగిస్తుందనీ, ఈ విధానం వ్యక్తిత్వ, బ్రాండ్ రాజకీయాల పెరుగుదలను ప్రేరేపిస్తున్నదని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులైన ఓటర్లు భావోద్వేగ అంశాలకు ఆకర్షితులవుతూ ఓటు వేస్తున్నారన్నారు. హిందూత్వ, పాక్ చైనా దేశాలను శత్రువులుగా చిత్రీకరిస్తూ భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ఇలాంటి ఓటర్లను బీజేపీ తన వైపు తిప్పుకుంటున్నదనీ, ఇలాంటి విధానం దీర్ఘ కాలంలో దేశానికి అనేక నష్టాలను తెచ్చిపెడుతుందని ఆందోళన చెందుతున్నారు. కాబట్టి, దేశం ఎదుర్కొంటున్న అసలైన సమస్యలు పార్లమెంటులో చర్చకు రావాలనీ, ప్రతిపక్షాలకు తగిన విలువ దక్కినపుడే అది సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు సూచిస్తున్నారు.