Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుషులతో పోలిస్తే మహిళలకు తక్కువ చెల్లింపులు
- పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి
- దేశంలో పురుషులకు రోజుకు సగటున దక్కేది రూ. 393
- మహిళలకు అందేది రూ.265 మాత్రమే..! : ఎన్ఎస్ఓ సర్వే
న్యూఢిల్లీ : దేశంలోని మహిళలకు ఫురుషులతో పోలిస్తే తక్కువ వేతనాలు దక్కుతున్నాయి. భారత్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేతన అంతరాలు గణనీయంగా కనిపిస్తున్నాయి. జాతీయ గణాంకాల కార్యాలయం ''2022లో భారత్‌లో మహిళలు మరియు పురుషులు'' పేరిట విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఈ నివేదిక సమాచారం ప్రకారం.. ఒకే పనిలో పురుషుల కంటే మహిళలకు తక్కువ వేతనాలను పొందతున్నారు. గత దశాబ్దకాలంలో వేతనాల్లో ఈ లింగ అంతరం పెరిగింది. అయితే పట్టణాల్లో మాత్రం ఈ అంతరం తగ్గడం గమనార్హం. జాతీయ గణాంకాల ప్రకారం దేశంలో ఒక గ్రామీణ పురుషుడికి ఒక రోజు సగటున దక్కే వేతనం రూ. 393గా ఉన్నది. అయితే, మహిళకు దక్కేది రూ. 265 మాత్రమే. పట్టణ ప్రాంతాల్లో పురుషులకు ఒకరోజుకు సగటున రూ. 483 దక్కితే, మహిళ రూ. 333 పొందుతున్నది.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని పురుషులు రోజువారి వేతనాలను అధికంగా పొందుతున్నారు. ఇక్కడ స్త్రీ, పురుషుల మధ్య వేతన అంతరమూ విస్తృతంగానే ఉన్నది. ఈ రాష్ట్రాల్లో సగటున పురుషుల వేతనాల్లో 60 శాతం కంటే తక్కువ వేతనాలు మహిళలకు దక్కుతున్నాయి. యూపీ, అసోం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిశా వంటి రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంత మహిళలకు పురుషులు పొందే వేతనాల్లో 70 శాతం కంటే తక్కువ పొందుతున్నారు. ఈ రాష్ట్రాల్లో ఒక్క కర్నాటక (పురుషులకు అత్యధిక వేతనాలు దక్కే రాష్ట్రాల్లో ఇది ఒకటి) మినహాయించి మిగిలిన ఐదు రాష్ట్రాల్లో రోజువారీ వేతనాలు రూ. 400 కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఇక ఉత్తరాఖండ్‌లో పట్టణ ప్రాంతాల్లోని మహిళలు పురుషుల కంటే కొద్దిగా ఎక్కువగానే సంపాదిస్తున్నారు.
హర్యానా, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పురుషులకు ఒక రోజుకు రూ. 400 కంటే ఎక్కువగానే దక్కుతున్నది. ఇక్కడ మహిళలు.. పురుషులు సంపాదించిన మొత్తంలో 85 శాతానికి పైగా సంపాదిస్తున్నారు. గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో మహిళలకు తగిన వేతనాలు ఇవ్వడం పక్కనబెడితే.. పురుషులకు తక్కువ మొత్తం దక్కుతున్నది. దీనికి విరుద్ధంగా, గుజరాత్, ఒడిషా మరియు జార్ఖండ్ వంటి రాష్ట్రాలు అతి తక్కువ మొత్తం వేతన రేట్లు కలిగి ఉన్నాయి, ఫలితంగా లింగ వేతన వ్యత్యాసం తక్కువగా ఉన్నది. ముఖ్యంగా, హర్యానా, రాజస్థాన్ మరియు హిమాచల్ ప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో మొత్తం వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ లింగ వేతన వ్యత్యాసం తక్కువగా ఉన్నది. 2011-12 నాటి వేతన గణాంకాలను పోల్చి చూస్తే 19 పెద్ద రాష్ట్రాల్లోని 11 రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో లింగ వేతన వ్యత్యాసం పెరిగింది. ఇందులో పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో10 శాతానికి పైగా పాయింట్లు పెరిగాయి.