Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ సంప్రదాయానికి ముగింపు పలకాలి
- న్యాయస్థానంలో పారదర్శకత ఉండాలి : ఓఆర్ఓపీ కేసులో సుప్రీం చురకలు
న్యూఢిల్లీ: దేశంలో అర్హులైన మాజీ సైనికులకు వన్ ర్యాంకు-వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై అభిప్రాయాలను సీల్డ్ కవర్లో సమర్పించడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తరఫున న్యాయవాదులు సమర్పించిన సీల్డ్ కవర్ నోట్‌ను కోర్టు తిరస్కరించింది. ఈ సంప్రదాయానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
''సుప్రీంకోర్టులో ఈ సీల్డు కవర్ సంప్రదాయానికి ముగింపు పలకాలి. ఇది ప్రాథమిక న్యాయ ప్రక్రియకు విరుద్ధం'' అని ఓఆర్ఓపీ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్ నరసింహ, జె.బి పార్ధివాలలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ''సీల్డు కవర్లకు నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. న్యాయస్థానంలో పారదర్శకత ఉండాలి. ఇది ఉత్తర్వుల అమలుకు సంబంధించినది. ఇందులో రహస్యమేముంది. నేను ఈ సీల్డు కవర్ సంప్రదాయానికి ముగింపు పలుకుదామనుకుంటున్నాను. దీనిని సుప్రీంకోర్టు అనుసరిస్తే హైకోర్టులూ అదే బాటలో పయనిస్తాయి'' అని చంద్రచూడ్ అటార్నీ జనరల్‌తో అన్నారు. ఎవరి జీవితానికైనా ప్రమాదం కలుగుతుందంటే, విశ్వసనీయ సమాచార మూలాల గురించి చెప్పేప్పుడు ఈ పద్ధతిని అనుసరించవచ్చని సూచించారు.
బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వ ఇబ్బందిని కోర్టు గమనిస్తున్నదని ఓఆర్ఓపీ కేసులో న్యాయస్థానం వ్యాఖ్యానించింది. వీటి చెల్లింపు ప్రణాళికను వివరించాలని కోరారు. ''బడ్జెట్ ప్రణాళిక ప్రకారం ఇంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం సాధ్యం కాదు. వనరులు పరిమితంగా ఉన్నాయి. ఖర్చును నియంత్రించాల్సి ఉన్నది'' అంటూ అటార్నీ జనరల్ కోర్టుకు వివరించారు. ఓఆర్ఓపీ బకాయిలపై కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంపై సుప్రీంకోర్టు ఈనెల 13న ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. బకాయిలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామంటూ రక్షణ మంత్రిత్వ శాఖ జనవరిలో ఇచ్చిన సమాచారాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.