Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడోసారి కవితను విచారించిన ఈడీ
న్యూఢిల్లీ : మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను దాదాపు పది గంటలకు పైగా సుదీర్ఘంగా ఈడీ అధికారులు విచారించారు. మంగళవారం ఉదయం తుగ్లక్ రోడ్డులోని సీఎం కేసీఆర్ నివాసం నుంచి కవిత బయలుదేరుతూ పది ఫోన్లను, వాటికి సంబంధించిన ఐఎంఈఐ నెంబర్లను మీడియాకు చూపించారు. అక్కడ నుంచి కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ కార్యాలయంలోని మూడో అంతస్తులో ఆమెను ఐదుగురు ఈడీ అధికారుల బృందం విచారించింది. కవిత విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పోలీస్ బలగాలు మోహరించాయి.
ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. మొత్తం పది గంటలకు పైగా కవితను అధికారులు ప్రశ్నించారు. కవితపై రెండోరోజు 20 ప్రశ్నలు సంధించగా.. మంగళవారం 15 ప్రశ్నలు అడిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కవిత వాడిన ఫోన్లను అధికారులకు అందజేయాలని కవితను సోమవారం నాడు ఈడీ అధికారులు ఆదేశించారు. దీంతో కవిత ఆ పది ఫోన్లను ఈడీకి సమర్పించారు. ఆ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాక.. అధికారులు అడిగిన ఫోన్లు ఇవేనా కాదా..? కవిత అవే ఫోన్లు తీసుకొచ్చారా..? లేదా అనేదానిపై మంగళవారం మొత్తం సెల్ ఫోన్ల గురించే విచారణ జరిగినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సెప్టెంబర్ 2021 నుంచి ఆగస్టు 2022 వరకు కవిత 10 ఫోన్లు వాడి, ధ్వంసం కూడా చేసినట్టు ఈడీ అభియోగం ఉంది. ఈ కేసులో మొత్తం 36 మంది 170 ఫోన్లు మార్చారని ఈడీ అభియోగాలు ఉన్నాయి. స్పెషల్ కోర్టుకు దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్లో కవిత 10 ఫోన్లు వాడినట్టు ఈడీ స్పష్టంగా తెలిపింది. అందుకే ఈడీ అభియోగం మేరకు కవిత 10 ఫోన్లను ఇవాళ అధికారులుకు ఇచ్చేశారు. రాత్రి 8 గంటల సమయంలో ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తితో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌ను ఈడీ కార్యాలయానికి అధికారాలు పిలిపించారు. ఆయన ఆథరైజేషన్ కోసం సంత కాలు తీసుకున్నారు. అనంతరం ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన కవిత అందరికీ అభివాదం చేస్తూ నేరుగా సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లారు.
ఈడీ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం దురదృష్టకరం
ఈడీ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకనుగుణంగా వ్యవహరించడం దురదష్టకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు కవిత లేఖ రాశారు. ''దర్యాప్తు సంస్థ చర్యలు దుర్వినియోగంగా ఉన్నప్పటికీ తదుపరి విచారణల్లో సహకరించడానికి మీరు కోరిన విధంగా గతంలో వినియోగించిన ఫోన్లు అన్నీ అందిస్తున్నాను. నా హక్కులకు భంగం కలిగిస్తున్నా ఎలాంటి పక్షపాతం లేకుండా అందజేస్తున్నా. అయితే మహిళ ఫోను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలిగించినట్లు కాదా?. 2022 నవంబరులో పలువురు నిందితుల విచారణలో ఫోన్లు ధ్వంసం అయ్యాయని స్టేట్మెంట్ ఇచ్చారని, దీన్ని నాకు కూడా ఆపాదిస్తూ చేసిన అసంబద్ధ ఆరోపణలు ప్రశ్నలించాలనుకుంటున్నా. నాకు సమన్లు జారీ చేయకుండా, నన్ను ప్రశ్నించకుండా దర్యాప్తు సంస్థ ఈ విధమైన ఆరోపణలు ఎలా చేస్తుంది? తొలిసారిగా 2022 మార్చిలో విచారణ నిమిత్తం నాకు సమన్లు జారీ చేశారు. గతేడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఆరోపించడం దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడం కాదా? అంతేకాకుండా ఉద్దేశపూర్వకంగా వాస్తవాలకు విరుద్ధంగా లీకులు ఇవ్వడం వల్ల రాజకీయ ప్రత్యర్థులు నన్ను నిందిస్తున్నారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడంతోపాటు నా పరువు, పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే యత్నం జరిగింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి ఈడి వంటి ఉన్నతమైన దర్యాప్తు సంస్థ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం దురదృష్టకరం. దీంతో నాపై వ్యతిరేక అభిప్రాయాలు సృష్టించడానికి దర్యాప్తు సంస్థ చేస్తున్న యత్నాలు తిప్పికొట్టడానికి ఫోన్లు అన్నీ ఇస్తున్నా'' అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖలో పేర్కొన్నారు.
సిసోడియా బెయిల్‌పై విచారణ 24కి వాయిదా
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. బెయిలుపై వాదనలు విన్న ప్రత్యేక కోర్టు సీబీఐని లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 24కి వాయిదా వేసింది. సిసోడియా కస్టడీని ఇప్పటికే రెండుసార్లు సీబీఐ కోర్టు పొడిగించింది. సిసోడియా బెయిలు అభ్యర్థనపై ఢిల్లీ కోర్టు మంగళవారంనాడు విచారణ చేపట్టింది. మద్యం కేసులో సీబీఐ విచారణకు సిసోడియా సహకరిస్తున్నారని, సీబీఐ సోదాల్లో ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు సీబీఐకి లభ్యం కాలేదని సిసోడియా తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఆయన కస్టోడియల్ ఇంటరేగేషన్కు ఇంకా పొడిగింపు అవసరం లేదనీ, విచారణ నుంచి ఆయన ఎక్కడకీ తప్పించుకుపో వడం లేదని వాదించారు.