Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కలిసి బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బీజేపీయేతర, కాంగ్రెస్సేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో భారత ప్రగతిశీల ముఖ్యమంత్రుల వేదిక (గ్రూప్ 8) ఏర్పాటుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ (కె చంద్రశేఖరరావు), తమిళనాడు (ఎంకె స్టాలిన్), కేరళ (పినరయి విజయన్), జార్ఖండ్ (హేమంత్ సోరేన్), పంజాబ్ (భగవంత్ సింగ్ మన్) తదితరులకు ఆయన ఇటీవల ఒక లేఖ కూడా రాసినట్టు తెలిసింది. 'మనమంతా కలిసి ప్రగతిశీల ముఖ్యమంత్రుల వేదిక (గ్రూప్ 8)గా కూటమి కడదాం' అని ఆయన లేఖలో ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే ఇదే అంశంపై చర్చలు జరిపేందుకు ఢిల్లీలో విందుకు రావాల్సిందిగా ఇదివరకే కేజ్రీవాల్ పలువురు ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. అయితే ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు మళ్లీ గ్రూప్ 8 వేదికను ఆయన తెరపైకి తీసుకురావడం విశేషం. కాగా సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్న తీరుపై గ్రూప్ 8 తొలి చర్యగా ఒక ఉమ్మడి పిటిషన్ దాఖలు చేయాలని కూడా కేజ్రీవాల్ తాజా లేఖలో ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే కేజ్రీవాల్ తాజా ప్రతిపాదనలకు సంబంధిత పక్షాలన్నీ అంగీకరించాయా లేదా అన్నది స్పష్టత లేదు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై ఉమ్మడి ఫిర్యాదు ఇవ్వడానికి టీఎంసీ, బీఆర్ఎస్, ఆప్ ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. సుప్రీంకోర్టు లేదా ఢిల్లీ హైకోర్టులో ఈ ఉమ్మడి పిటిషన్ దాఖలు చేసే వీలుందని ఆప్ సీనియర్ నేత ఒకరు తెలిపారు.