Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలంగాణ ఆడబిడ్డ కవితపై ప్రతాపం చూపిస్తారా? కక్షసాధింపు చర్యలకు పాల్పడతారా? అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత సెల్ఫోన్లను ధ్వంసం చేశారని గతంలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి తక్షణమే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఈడీ విచారణలో భాగంగా మంగళవారం గతంలో ఉపయోగించిన 10 సెల్ఫోన్లను ఎమ్మెల్సీ కవిత ఈడీ అధికారులకు సమర్పించినందున... కేంద్రమంత్రి కిషన్రెడ్డి కవితకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం నాడిక్కడ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గొప్ప గొప్ప మాటలు చెప్పే కిషన్రెడ్డి... ఏ ఆధారాలు లేకుండా ఊహించుకొని అబద్ధాలతో ఒక మహిళ ప్రతిష్టను దిగజార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకాశం ఇచ్చారు కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ ప్రజలు సహించరన్న విషయాన్ని కిషన్రెడ్డి గుర్తుంచుకోవాలని మంత్రి హితవు పలికారు. తెలంగాణ ఆడబిడ్డ కవితపై తమ ప్రతాపం చూపిస్తున్నారని, కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని విమర్శించారు. దేశంలో లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకొని విదేశాలకు పారిపోయిన అవినీతిపరులను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టుకోవట్లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేగాక లక్షల కోట్లు కొల్లగొట్టిన వారిని వదిలిపెట్టి, ఉల్లిగడ్డపై పొట్టు మాదిరి లాంటి రూ.100 కోట్ల స్కామ్ అనే పేరుతో లేని అధారాలను సృష్టించి కవితను వేధిస్తూ అప్రతిష్టపాలు చేయాలని ప్రయత్ని స్తున్నారని మండిపడ్డారు.