Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అదానీ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తమకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందేనని ప్రతిపక్షాలు నినదించాయి. మంగళవారం పార్లమెంట్లో మొదటి అంతస్థులో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ కార్యాలయం ఎదుట ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. ''వుయ్ వాంట్ జేపీసీ'' అని ప్లకార్డులు చేబూని నినాదాల హౌరెత్తించారు. అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారాన్ని జేపీసీ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ స్టాక్ మ్యానిపులేషన్, ఆర్థిక మోసాలు వంటి అక్రమాలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక తరువాత ఎస్బీఐ తీవ్రంగా దెబ్బతిన్నదని అన్నారు. ప్రధాని చర్చ నుంచి ఎందుకు పారిపోతున్నారని ప్రతిపక్షనేత మల్లికార్జన ఖర్గే ప్రశ్నించారు. ''ప్రభుత్వం పార్లమెంటులో చర్చలను ఎందుకు నిలిపివేస్తోంది? సభను నిర్వహించడం, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత కాదా?'' అని ప్రశ్నించారు.
కొనసాగిన ప్రతిష్టంభన
అదానీ వివాదంపై జేపీసీ దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు, లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అధికార బీజేపీ సభ్యులు ఆందోళనతో పార్లమెంట్ సమావేశాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిష్టంభన మంగళవారం కూడా కొనసాగింది. లోక్‌సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మధ్యాహ్నం రెండు గంటల వరకు సభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో ఆందోళన మధ్యే, కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ, కాశ్మీర్ కోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 1.118 లక్షల కోట్ల బడ్జెట్‌కు సంబంధించిన బిల్లును ఆమోదం పొందింది. జమ్మూ కాశ్మీర్ బడ్జెట్‌ను నినాదాల మధ్య ఒక్క నిమిషంలోనే మూజువాణి ఓటుతో ఆమోదించారు. వెంటనే సభ గురువారానికి వాయిదా పడింది. రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అదానీ-హిండెన్‌బర్గ్ సమస్యపై చర్చను రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ తిరస్కరించారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఫలితంగా మధ్యాహ్నం రెండు గంటల వరకు రాజ్యసభ వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలో అదే పరిస్థితి కొనసాగడంతో సభ గురువారానికి వాయిదా పడింది.
రాజ్యసభ చైర్మెన్ సమావేశానికి ప్రతిపక్షాలు దూరం
రాజ్యసభ చైర్మెన్ మంగళవారం ఉదయం 11:30 గంటలకు అన్ని పార్టీలను సమావేశానికి పిలిచారు. అయితే ఈ సమావేశానికి బీజేపీ, వైసీపీ, టీడీపీ ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరు కాలేదు. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, జేడీయూ, అన్నాడీఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన (ఠాక్రే), బీఆర్ఎస్, ఏజీపీ పార్టీల నాయకులు గైర్హాజరయ్యారు.
కేంద్ర మంత్రులతో మోడీ భేటీ
ప్రధాని మోడీ మంగళవారం ముఖ్యమైన కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో దశలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఉభయ సభల సమావేశాలు ప్రారంభమవడానికి ముందు ఈ భేటీ జరిగింది.