Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుంటే దేశ ఆహార భద్రత నాశనమవుతుందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్ హెచ్చరించారు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించడం రైతులకే కాకుండా దేశానికి కూడా మేలు చేస్తుందన్నారు. ఏప్రిల్ 5న ఢిల్లీలో జరిగిన ఉమ్మడి కార్మిక రైతుల కవాతు (మజ్దూర్ కిసాన్ సంఘర్ష్ ర్యాలీ) సందర్భంగా మంగళవారం నాడిక్కడ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (పీసీఐ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆహ్వాన సంఘ చైర్మెన్ ప్రొఫెసర్ ప్రభాత్ పట్నాయక్ మాట్లాడారు. కనీస మద్దతు ధర ఇవ్వకుంటే రైతులు అన్నదాత సాగు నుంచి తప్పుకుంటారు. ఇది భారతదేశంతో పాటు కొన్ని ఆఫ్రికన్ దేశాల ఆహార భద్రతలను గణనీయంగా ప్రభావితం చేస్తోందన్నారు. లేబర్ కోడ్లు, వ్యవసాయ చట్టాలతో నయా ఉదారవాద విధానాలను క్రూరంగా అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాస్తూ కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. ఉపాధి హామీకి నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం విధానాలకు కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులు బాధితులయ్యారని పేర్కొన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో ఈ వర్గాలే కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. దేశ లౌకికవాదాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో కార్మిక, రైతు ఉమ్మడి పోరాటం ప్రధాన పాత్ర పోషిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఏఐకేఎస్ ఉపాధ్యక్షుడు హన్నన్ మొల్లామాట్లాడుతూ.. ఉత్పత్తి వర్గాలైన కార్మిక, రైతు, వ్యవసాయ కార్మికులు దోపిడీకి గురవుతున్నారని అన్నారు. దేశంలో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఎంఎస్పీ కోసం రైతులు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ సంఘాల ఆధ్వర్యంలో ఐదు లక్షల మంది ఢిల్లీకి చేరుకుంటారని తెలిపారు. దీనికి ముందు కోటి మందికి చేరువయ్యేలా ప్రచార కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామన్నారు. నాలుగు వందల జిల్లాల్లో ఉమ్మడిగా సభలు పూర్తి చేశామన్నారు.
సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ మాట్లాడుతూ దేశంలో 93 శాతం కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారని, వారి భద్రత ప్రశ్నార్ధకంగా ఉన్నదని అన్నారు. కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ ప్రయివేటీకరణకు స్వస్తి పలకాలనీ, సంపన్నులపై అదనపు పన్నులు విధించాలని కోరుతూ ఈ ఆందోళన జరుగుతోందన్నారు. గత ఐదు నెలలుగా దేశవ్యాప్తంగా మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రచారం చేస్తున్నామని, క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు ఈ ర్యాలీ సందేశం వెళ్తుందని తెలిపారు. ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ మాట్లాడుతూ దేశంలో 25 కోట్ల మంది దళితులు ఉన్నారని, వారిపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ మద్దతుతో దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఏడు శాతం మంది గిరిజనులు ఉన్నారనీ, వారికి సంబంధించిన అటవీ హక్కుల చట్టాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. ఉపాధి హామీకి గతంలో 4 శాతం నిధులు కేటాయిస్తే, ఇప్పుడు 1.3 శాతానికి తగ్గించారని తెలిపారు. పార్లమెంట్లో ఎలాంటి చర్చ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిస్తుందని దుయ్యబట్టారు. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు వన్ నేషన్, వన్ రేషన్ కార్డు తీసుకొచ్చారని విమర్శించారు.