Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటి నాణ్యతపై 97శాతం కుటుంబాలు ఆందోళన
- లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో 97శాతం కుటుంబాలకు సురక్షితమైన నీరు లభించటం లేదని 'లోకల్ సర్కిల్స్' సర్వే పేర్కొంది. మున్సిపాల్టీ, గ్రామపంచాయతీలు సరఫరా చేస్తున్న తాగునీటిని శుద్ధి చేయడానికి 'ఆర్వో వ్యవస్థ'ను ఏర్పాటు చేసుకున్నట్టు సర్వేలో పాల్గొన్న 44శాతం మంది చెప్పారు. నీటిశుద్ధి ప్రక్రియ చేపడుతున్న 'ఫిల్ట్రేషన్ ఫ్లాంట్ల' వద్ద నీటి నాణ్యత అత్యున్నతం కావొచ్చు, అక్కడ్నుంచీ నీరు ప్రయాణించాక.. నాణ్యత తగ్గుతోందని అత్యధికశాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలు సరఫరా చేస్తున్న నీటి నాణ్యతను 97శాతం మంది విశ్వసించటం లేదని సర్వేలో తేలింది. దేశంలో ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన 'లోకల్ సర్కిల్స్', 305 జిల్లాల్లో 26వేల మంది నుంచి వివరాలు సేకరించింది. స్థానికంగా సరఫరా చేస్తున్న నీటి నాణ్యత గతంతో పోల్చుకుంటే మెరుగుపడిందని 44శాతం మంది అభిప్రాయపడ్డారు. నీటి నాణ్యత అత్యంత పేలవంగా ఉందని 14శాతం కుటుంబాలు, 'సామాన్యం'గా ఉందని 32 శాతం కుటుంబాలు పేర్కొన్నాయి. తమకు సరఫరా అవుతున్న తాగునీటిని 97శాతం కుటుంబాలు వివిధ పద్ధతుల్లో శుద్ధి చేసుకుంటున్నాయి. ఎక్కువమంది ఆర్వో సిస్టమ్, వాటర్ ప్యూరిఫైర్స్..వాడుతుండగా, 5శాతం మంది మట్టిపాత్రలతో నీటిని వడకడుతున్నారు. మరో 5శాతం కుటుంబాలు నీటి బాటిల్స్‌ను కొనుగోలు చేస్తున్నాయని సర్వే పేర్కొంది.