Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి భవన్లో అవార్డులను బహూకరించిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ: గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ ఏడాది మొత్తం 106 పద్మ పురస్కారాలను ప్రకటించగా.. వీరిలో 50మందికి పైగా ప్రముఖులకు పద్మవిభూషణ్, పద్మభూషన్, పద్మశ్రీ పురస్కారాలు అందజేశారు. మిగతా వారికి మరో సందర్భంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటుచేసి అవార్డులను అందజేసి వారిని గౌరవించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా కర్నాటక మాజీ సీఎం ఎస్.ఎం.కష్ణ, ప్రొఫెసర్ బాలకృష్ణ దోషి (మరణానంతరం) ఆయన కుటుంబ సభ్యులు పద్మవిభూషణ్ అందుకోగా.. ప్రముఖ వ్యాపారవేత్త కుమార మంగళం బిర్లా, ప్రఖ్యాత ప్లేబ్యాక్ సింగర్ సుమన్ కల్యాణ్‌పుర్, ప్రొఫెసర్ కపిల్ కపూర్, ఆధ్యాత్మికవేత్త కమ్లేశ్ డి పటేల్ (తెలంగాణ) పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్‌రావు, చింతలపాటి వెంకటపతిరాజు, ఆచార్య ప్రకాశ్ చంద్రసూద్, డా మోదడుగు విజయ గుప్తా, పసుపులేటి హన్మంతరావు, బండి రామకష్ణ, సీవీ రాజు, కోటా సచ్చిదానందతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ఆయా రంగాల ప్రముఖులు పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్, ప్రధాని మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.